ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉండగా, ఎంతో కాలంగా ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌కి మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై జరుగుతున్న రగడ ఇంకా చల్లారినట్లు కనిపించలేదు. అయినా ఓ ప్రతిపక్ష నాయకునికి మోదీ ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వకూడదు? తెలుగుదేశం వారి అనుమతి తీసుకుని జగన్‌కి మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వాలా? అనే ప్రశ్నలను బిజెపి నేతలు ధీటుగా ముందుకు తీసుకొస్తున్నారు.
అసలు జగన్ నిందితుడే కానీ దోషి కాదని, మరి ఆయన్ను పదే పదే ఆర్దికనేరస్థునిగా టిడిపి నేతలు పరిగణించడం సరికాదని దగ్గుబాటి పురందేశ్వరి అంటున్నారు. అయినా మోదీ జగన్‌కి అపాయింట్‌మెంట్ ఇస్తే అంత ఉలుకేందుకుని, ఎందుకు భయపడుతున్నారని వారు చంద్రబాబుపై ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు, చంద్రబాబు సన్నిహితునిగా పేరున్న వెంకయ్యనాయుడు సైతం ఇవే ప్రశ్నలను సంధించారు.
తాము రాష్ట్ర పతి ఎన్నికల్లో ఎవరు మద్దతిచ్చినా తీసుకుంటామని ఆయన తేల్చేశారు. ఇక 2019 వరకు బిజెపికి టిడిపితో పొత్తు ఉంటుందని, దానిలో ఢోకా లేదని, కానీ ఆ తర్వాత నిర్ణయం పార్టీ అధిష్టానం చేతుల్లో ఉందని వెంకయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన టిడిపికి వచ్చే ఎన్నికల్లో తమ స్టాండ్ ఎలా ఉండనుందో చూచాయగా తెలియజేసినట్లేనని చర్చలు ఊపందుకున్నాయి.