గతంలో తేజ దర్శకత్వంతో పాటు పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సంగీత సంచలనం ఆర్‌పి పట్నాయక్. ఈయనకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉందని అందరూ భావించారు. ఇక తేజ, పాటల రచయిత కులశేఖర్ వంటి వారు కనుమరుగు కావడం, పట్నాయక్ కూడా సంగీతాన్ని వదిలేసి నటునిగా, దర్శకునిగా మారాడు. కానీ ఆయన సంగీత దర్శకత్వం చేయకపోవడానికి నాగార్జున కారణమనే వాదన కూడా ఉంది. దీనిపై ఆర్‌పి స్పందించాడు.
నా సంగీత దర్శత్వ భవిష్యత్తుకు నాగ్‌కి సంబంధం లేదు. కాగా 'నేనున్నాను' చిత్రం సమయంలో జరిగిన ఓ సంఘటన వల్ల సంగీతానికి దూరంగా ఉన్నాను. ఆ చిత్రానికి నేనే సంగీత దర్శకుడిని. కొన్ని ట్యూన్స్ కూడా ఇచ్చాను. కానీ ఒక రోజు ఈ చిత్రానికి సంబంధించిన ఓ పెద్ద మనిషి నా వద్దకు వచ్చి నిన్ను పెట్టుకోవడం లేదని చెప్పాడు. కారణం అడిగితే నీ పేరు చెబితే సినిమాకు బిజినెస్ జరగడం లేదని సమాధానం ఇచ్చాడు. నిర్మాతలు బాగుంటేనే పది మందికి మేలు జరుగుతుంది.
అలాంటి నిర్మాతలకు నా వల్ల నష్టం రాకూడని నిర్ణయించుకుని ఆ నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో నాగార్జున గారికి ఏమీ తెలియదు. అది ఆయన నటించిన చిత్రం కావడంతో అలా ప్రచారం జరిగిందని క్లారిటీ ఇచ్చాడు. ఇక నాగబాబు నిర్మాతగా, పవన్ కళ్యాణ్ హీరోగా, వీరశంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గుడుంబా శంకర్'కి కూడా మొదట నేనే సంగీత దర్శకుడిని, ఆ చిత్రం ఒప్పుకున్నప్పుడే నాకు ఓ విదేశీ టూర్ ఉందని చెప్పాను. కానీ మేనేజర్లతో కమ్యూనికేషన్ లోపం వల్ల ఆ అవకాశం చేజారిందని చెప్పుకొచ్చాడు.