తాజాగా 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రాన్ని శాటిలైట్ సర్వర్ ద్వారా పైరసీ చేయడం, వాటి శాంపిల్స్‌ను నిర్మాతలకు చూపించి, డబ్బులు డిమాండ్ చేయడం, చివరకు నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు పాట్నాలో నిందితులని అరెస్ట్ చేయడం తెలిసిందే, ఇక ఈ చిత్రం పైరసీ రాయుళ్లను అరెస్ట్ చేయించడంలో తాను కూడా క్రిమినల్ మైండ్‌ను వాడానని ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన నిర్మాత కరణ్ జోహార్ కూడా తెలిపాడు. కరణ్ మాట్లాడుతూ, మామూలు చిత్రాలైతే పట్టించుకునే వాడిని కాదని, కానీ 'బాహుబలి' వంటి సగర్వమైన చిత్రం విషయంలో ఇలా జరిగేసరికి తీవ్ర చర్యలు తీసుకున్నామని తెలిపాడు.
తాజాగా రాజమౌళి మాట్లాడుతూ, సినిమాలలో కొత్త కొత్త టెక్నాలజీలని వాడినట్లే పైరసీ రాయుళ్లు కూడా కొత్త టెక్నాలజీలను వాడుకుంటున్నారని అన్నాడు. గతంలో మారుమూల థియేటర్లలో క్యామ్‌క్యాడర్స్ పెట్టి రహస్యంగా అర్ధరాత్రి పైరసీ చేసేవారని, 'ఈగ' సమయంలో దానికి సహకరించిన ఓ థియేటర్‌ను కూడా సీజ్ చేశామని, కానీ నేడు వారు సరికొత్త పద్దతులు వాడుతున్నారన్నాడు. ఈ పైరసీని అరికట్టాలంటే ఒక్క సినిమా యూనిట్, పోలీసులే కాదు.. ప్రేక్షకులు కూడా ఇన్‌వాల్వ్ కావాలని, పైరసీ వచ్చిన తర్వాత అరికట్టడం కంటే ముందుగానే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఇక్కడ కోట్లు ఖర్చు పెట్టి, రాత్రింబగళ్లు కష్టపడే వారికి పైరసీ వల్ల ఎంత నష్టమో అందరికీ తెలుసు. కానీ తమ చిత్రాలు విడుదలైనప్పుడు మాత్రమే ఈ బడా నిర్మాతలకు, దర్శకులకు పైరసీ గుర్తుకొస్తుంది. తమ చిత్రం సీన్ లీక్ అయితేనే లీకేజీ గుర్తుకొస్తుంది. మరి చిన్న సినిమాలు ఒక్కరోజు గ్యాప్‌లోనే పైరసీ సీడీలుగా, ఇంటర్నెట్‌లో కనిపిస్తుంటే వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? 'బాహుబలి' పెద్ద చిత్రం. పెద్ద నిర్మాతలు, పెద్ద దర్శకుడు, పెద్ద తారాగాణం, బాగా రాజకీయ ఆర్థిక పలుకుబడిని కలిగిన వారి చిత్రం.
అదే ఏ చిన్న చిత్రానికో ఇలా జరిగితే పోలీస్ యంత్రాంగం ఇంత ఉత్సాహం చూపి పాట్నా వెళ్లి పైరసీ రాయుళ్లను అరెస్ట్ చేస్తుందా? కరణ్ జోహార్ తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో గానీ 'బాహుబలి' కాబట్టే తాను అంతగా రియాక్ట్ అయ్యానన్నాడు. ఇక పైరసీలో ఇంటి దొంగలు ఎందరో ఉన్నారు. ఒక హీరోను వ్యతిరేకించే ఇతర హీరోల వీరాభిమానులు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. మరి ఈ విషయంలో సినీ పరిశ్రమ మొత్తం ఒక్కతాటిపైకి వచ్చేదెప్పుడు?