ఇప్పటి వరకు నాగ చైతన్యకు సోలో హీరోగా ఇంకా బ్లాక్ బస్టర్ రాలేదు. ఇక క్లాస్ చిత్రాల హీరోగా పేరున్నప్పటికీ మాస్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం మాత్రం ఇంకా నెరవేరలేదు. 26న విడుదల కానున్న 'రారండోయ్ వేడుక చూద్దాం'తో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆలోటును తీరుస్తాడని అనిపిస్తోంది. ఇక నాగచైతన్యకు ఆయన తండ్రిదైన అన్నపూర్ణ స్టూడియోస్ వంటి సొంత బేనర్ ఉంది. కానీ నాగచైతన్య మాత్రం అప్పుడు తనకంటూ మరో కొత్త బేనర్ కావాలని కలలుకంటున్నాడు.
దీనికి ఆయన తండ్రి నాగార్జున సపోర్ట్ కూడా ఉందని చెప్పాడు. నీకు నచ్చిన కథ తీసుకుని రా.. చేద్దామని నాగ్ సైతం చెప్పాడట. అయినా హీరోగా ఇంకా పూర్తి స్థాయిలో నిలదొక్కుకోకుండానే ఇప్పుడే నిర్మాణ బాధ్యతలు ఎందుకు? అని కొందరు అంటున్నారు. ఇక నాగ్‌ని సమంత సార్ అని పిలిచేదని, నిశ్చితార్ధం జరిగిన తర్వాత కూడా ఇంకా సార్.. ఎందుకు అని నాన్న, నేను అనే వారిమని, ఇప్పుడు మామా..కోడలా పిలుపుకు అలవాటు పడ్డారని తెలిపాడు.
ఇక సమంతలో తనకు ఓ విషయం నచ్చదని చైతు చెప్పాడు. తమ పర్సనల్ విషయాలను కూడా సమంత సోషల్ మీడియాలో తెలియజేస్తుందని, అది తనకు నచ్చదని, కానీ ఆమెకు ఆ స్వేచ్చ ఉండటంతో తాను మౌనంగా ఉన్నానంటున్నాడు. ఇక నాగ్ అయితే తనకు పెద్దగా సలహాలు, సూచనలు ఇవ్వడని, ఆయన తనకు తండ్రి కంటే ఫ్రెండ్ కంటే ఎక్కువని, తనకు పూర్తి స్వేచ్చనిస్తాడని, దానిని తాను సద్వినియోగం చేసుకోవాలని చెప్పుకొచ్చాడు.