మోదీ ఎంత నియంత అయినా కూడా.. అమిత్‌షా ఎంత గొప్ప వ్యూహ రచనా చతురుడైనప్పటికీ ఇటీవల బిజెపిలో కూడా సొంత పార్టీని, విధానాలను విమర్శించే వారు ఎక్కువవుతున్నారు. గతంలో పార్టీకి వ్యతిరేకంగా జిన్నా వంటి వారిపై పొగడ్తలు కురిపించినప్పుడు అద్వానీ సైతం బహిరంగ క్షమాపణలు చెప్పి, అవి తన సొంత అభిప్రాయాలు అని చెప్పాడు. కానీ ప్రస్తుతం మేనకా గాంధీ కుమారుడు, ఎంపీ వరుణ్ గాంధీ తాజాగా కేంద్రంలోని బిజెపిపై మండిపడ్డాడు.
ఇక సీనియర్ నటుడు, బిజెపి ఎంపీ శత్రుఘ్నుసిన్హా కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. లాల్ ప్రసాద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్‌లను పనిగట్టుకుని అప్రదిష్ట పాలు చేయడం సమంజసం కాదన్నాడు. వారిపై ఖచ్చితమైన ఆధారాలుంటే వేధించడం కాకుండా నేరుగా అరెస్ట్ చేసి కేంద్రం తన పారదర్శకతను నిరూపించుకోవాలని సవాల్ విసిరాడు. రాజకీయ కక్ష్యలు మన పార్టీ విధానం కాదని, కేవలం కొందరిని అప్రతిష్ట పాలు చేయడం కోసం పావులు కదపడం ప్రమాదకరమన్నాడు.
ఇక తమిళనాడు బిజెపి నేత, సంచలన వివాదాస్పద నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి రజినీపై నీచమైన కామెంట్లు చేశాడు. ఒకవైపు అమిత్‌షా రజినీకి బిజెపి గేట్లు ఎప్పుడు తీసే ఉంటాయని చెబుతుంటే, ఇంకోవైపు ఈ వారంలోనే ప్రదాని మోదీని.. రజినీ కలవనున్న నేపథ్యంలో రజినీకి చదువురాదని, ఆయనకు రాజ్యాంగం, ప్రాధమిక హక్కుల గురించి కూడా తెలియదని మాట్లాడటం చూస్తే బిజెపిలో కూడా ఎవరికి వారే యమునా తీరే.. అన్నట్లుగా కనిపిస్తోంది.