యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన బిజినెస్ మాన్ బీ.ఆర్.శెట్టి భారీ బడ్జెట్ తో 'మహాభారత' చిత్రాన్ని నిర్మిస్తానని ఎనౌన్స్ చేసినప్పటి నుండి ఆ చిత్రంపై అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ 'మహాభారత' చిత్రానికి శ్రీ కుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముని పాత్రలో చేయనున్న ఈ చిత్రం రచయిత ఎం. టీ.వాసుదేవన్ నాయర్ రచించిన ‘రందమూజం’ పుస్తక ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే ఇప్పుడు ఇంకా ఈ చిత్రం మొదలుపెట్టనైనా లేదు అప్పుడే ఈ చిత్రంపై వివాదం మొదలైంది.
'మహాభారత' చిత్ర టైటిల్ పై అప్పుడే కేరళలో రచ్చ మొదలైంది. రచయిత ఎం. టీ.వాసుదేవన్ నాయర్ రచించిన ‘రందమూజం’ పుస్తక టైటిల్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘రందమూజం’ టైటిలే పెట్టాలని..... వ్యాస మహర్షి రాసిన మహాభారతం పేరు పెట్టకూడదని కేరళ హిందూ ఐక్య వేదిక అధ్యక్షురాలు కె.పి. శశికళ డిమాండ్ చేస్తున్నారు. వ్యాస మహర్షి రాసిన మహాభారతమే... మహాభారతం పేరుకు సార్ధకత అని... ఇక ఏ చిత్రాన్నీ ఈ పేరుతో తీయరాదని అంటున్న ఆమె.. 'రందమూజం' టైటిల్ నే ఖరారు చేయాలని, లేకపోతే కేరళలో ఈ సినిమాను ప్రదర్శించనివ్వబోమని హెచ్చరించారు.
మరి ఈ ఏడాది సెప్టెంబరులో అబూధాబిలో ఈ మహాభారత ని ప్రారంభించి 2020 సంవత్సరం కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి విడుదల చేస్తామని మేకర్స్ అంటున్నారు. అయితే విడుదలకు ముందే ఈ రకమైన వివాదాలు ముసురుకుని ఈ 'మహాభారత' చిత్రానికి మాత్రం బాగా పబ్లిసిటీ వచ్చేలా వుంది. ఇక ఈ చిత్రాన్ని ఇండియాతో బాటు మరికొన్ని ఇతర దేశాల్లో షూటింగ్ జరుపుతారని సమాచారం. ఈ 'మహాభారత' చిత్రాన్ని తెలుగుతో సహా నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.