మన దేశంలో సంప్రదాయాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, మహిళలను దేవతామూర్తులుగా కొలిచే సంప్రదాయం ఉంది. కానీ రాను రాను భారత్‌లో కూడా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సోషల్ మీడియాతోపాటు ప్రపంచీకరణతో దేశాల మధ్య, ప్రాంతాల మధ్య తేడాలు, దూరాలు తరిగిపోతున్నాయి. కానీ కొందరు మాత్రం తమ మనసులో మహిళల పట్ల గౌరవం లేకపోయినా, వారిని అవమానించేలా మాట్లాడుతున్నా కూడా ఇంటర్వ్యూలలో, మైకుల్లో, టీవీల్లో, వేదికలపై మహిళా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు, మరీ ముఖ్యంగా మా చిత్రాలను ఆదరించే మహిళా మూర్తులకు అంటూ సొల్లు మాటలు మాట్లాడుతారు.
కానీ స్వయంగా చూస్తేగానీ వారికి మహిళలపై ఉన్న గౌరవం ఏమిటో అర్ధం కాదు. దూరంగా ఉండేవారందరికీ నునుపు కనిపిస్తుంది. కానీ స్వయంగా చూసే వారికి మాత్రమే వాస్తవం బోధపడుతుంది. ఓ బలహీనుడిని ఆడుకోవడం, బలవంతుల జోలికి రాకపోవడం మన దురదృష్టం. న్యాయం ఎవరికైనా, చివరకు ప్రధానమంత్రి, రాష్ట్రపతులకు కూడా న్యాయంగానే పనిచేయాలి. బలవంతుల పట్ల ఓ విధంగా, బలహీనుల పట్ల మరో విధంగా పనిచేయడం బాధాకరమే. సన్నిలియోన్ వంటి పోర్న్ స్టార్ చిత్రాలను ఎగిరి చూసేది మనమే. తాత ముత్తాతల వయసులో కూడా కిర్రాక్ స్టెప్స్ వేస్తే చూసేది మనమే. అలాంటి వారిని ఆదరించేది మనమే.
బూతు చిత్రాలను కూడా ఎగబడి నవ్వేది మనమే. టీవీలలో వచ్చే 'జబర్దస్త్, పటాస్' వంటి వాటికి హైటీఆర్పీ రేటింగ్‌లు వచ్చేలా చేసేది మనమే. బూతు పోస్టర్లను, వీడియోలను లైక్ చేసేది, షేర్ చేసేది మనమే. రేపు బూతు మీద ఎక్కడైనా తప్పు జరిగితే ఉద్యమాలు, కేసులు వేసేది మనమే.. అదే మన దురదృష్టం.