కమెడియన్‌గా పీక్ స్టేజీలో ఉన్నప్పుడు సునీల్ హీరోగా మారాడు. తనదైన శైలికి సరిపడే 'అందాల రాముడు, మర్యాదరామన్న, పూలరంగడు' వంటి హిట్ చిత్రాలలో నటించాడు. ఇక నాగచైతన్యతో కలిసి 'తడాఖా' అనే మాస్ చిత్రం చేశాడు. కాగా తెలుగులో కమెడియన్లుగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌లుగా ఉన్నప్పుడే హీరోగా రాజేంద్రప్రసాద్ వంటి వారు తమ సత్తా చాటారు. ఇక అలీ, బ్రహ్మానందం, బాబూమోహన్,కోట, చివరకు సప్తగిరి వరకు హీరోలయ్యారు.
కానీ వీరిలో బాగా పాపులర్ అయింది మాత్రం రాజేంద్రుడే. మిగిలిన వారు ఒకటి రెండు హిట్లిచ్చినా మరలా కమెడియన్లుగానే కొనసాగుతున్నారు. తాజాగా సప్తగిరి కూడా అటూ ఇటూ కాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక సునీల్‌కి మాస్ పిచ్చి కూడా బాగా ముదిరింది. సిక్స్‌ప్యాక్‌లు వగైరా ట్రై చేశాడు. తన నుంచి ప్రేక్షకులు ఏమి ఆశిస్తున్నారో తెలిసి కూడా మాస్ జపం చేస్తున్నాడు.తనకున్న డ్యాన్సింగ్ స్కిల్‌తోనే హీరో అయిపోవాలని భావించాడు.
చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారి చిత్రాలలో సపోర్టింగ్ రోల్స్ వచ్చినా హీరోగానే ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆయనకు ఈమద్య చాలాకాలంగా ఒక్క హిట్ కూడా లేదు. ప్రస్తుతం ఆయన క్రియేటివ్ డైరెక్టర్ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'ఉంగరాల రాంబాబు' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయినప్పటికీ బయ్యర్లు కొనడానికి ముందుకురావడం లేదు. దీంతో పాపం.. నష్టాలతో సినిమాను రిలీజ్ చేసే పరిస్థితుల్లో తాము లేమని, అసలు రేటు వచ్చినా అమ్మడానికి సిద్దంగా ఉన్నామని, కానీ బయ్యర్లే తమ వైపు చూడటం లేదని నిర్మాతలు వాపోతున్నారట...!