సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఇప్పటికీ పదిరూపాయలను వెనకేసుకోని నటుడు ఎవరు? అంటే ఎవరైనా సరే ఠక్కున లోకనాయకుడు కమల్ హాసన్ పేరు చెబుతారు. సినిమాలు, నటనే శ్వాసాగా సాగే ఆయన జీవన ప్రయాణంలో తాను సంపాదించిన ప్రతి పైసా సినిమాలలోనే పెట్టాడు. ఇక 'విశ్వరూపం' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం సెకండ్ పార్ట్ 'విశ్వరూపం2' ఆగిపోయినా కూడ ఇప్పుడు మరలా ఆ సినిమా దుమ్ము దులిపి ఈ ఏడాదిలోనే విడుదల చేసే పనిలో ఉన్నాడు.
ఇక కమల్ ఆనాడు ఎప్పుడో 100కోట్లకు పైగా బడ్జెట్‌తో బ్రిటిష్ రాణి ఎలిజబెత్ అతిధిగా ఆయన 'మరుదనాయగం' అనే డ్రీమ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం నుంచే సంచలనం సృష్టించింది. ఇంతలోనే ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. రెండు షెడ్యూల్స్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని కూడా తన స్నేహితుల సాయంతో కమల్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం ఎన్ని రిస్క్‌లైనా తీసుకోవడానికి రెడీ అంటున్నాడు. భారతదేశ తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు, బ్రిటిషర్లకు ఎదురొడ్డి నిలిచిన వీరుడు మహ్మద్ యూసఫ్‌ఖాన్ కథే ఇది.
ఆయనను మరుదనాయగం పిళ్లై అని కూడా పిలుస్తారు. రెండు దశాబ్దాల కాలం కిందట మొదలైన ఈ చిత్రం మరలా ప్రారంభం కానుంది. ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తయింది.ఓ అంతర్జాతీయ సినీ సంస్థతో కలిసి ఈ చిత్రంలోని స్టిల్స్‌ను, మరికొన్ని కొత్త స్టిల్స్‌ను బయటకు తీసి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ పోస్టర్లను పెట్టాడు కమల్. తెలుగు తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' రూపొందనున్న సమయంలోనే తొలితరం తమిళ పోరాట యోధుడు మరుదనాయగం పిళ్లై జీవిత చరిత్ర కూడా మరలా వెలుగు చూడనుండటం సంతోషకరమైన విషయం.