బతికున్నప్పుడు ఏమి చేశారో? కనీసం మంచం మీద ఉన్నప్పుడైనా సేవలు చేశారో లేదో తెలియదు కానీ ప్రతిఏడాది స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వచ్చింటే చాలు తెలుగుదేశం వర్గాలు, చంద్రబాబు అందరూ మహానాడు పేరుతో ఎన్టీఆర్‌పై ఎంతో ప్రేమ చూపిస్తారు. ఇక హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాటులో అయితే ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి నుంచి ఆయన కొడుకులు, మనవళ్లతో సందడిగా మారిపోతుంది. నారా వారిని నందమూరి వారు, నందమూరి వారిని నారా వారు ఇన్‌డెరెక్ట్‌గా సెటైర్లు వేయడంలో మునిగిపోతారు.
ఇక ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ దైవమని, ఈ రోజు తెలుగువారికి పండగ రోజు అంటూ ఊదరగొడుతుంటారు. ఇక ఈ రోజు కూడా అదే తంతు నడిచింది. నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ ఎన్టీఆర్ ప్రవేశపెట్టినవేనని, వాటికే రంగులు పూసి వాడుతున్నారని ఎద్దేవా చేశాడు. మహిళలు ఈ రోజు అర్ధరాత్రి కూడా ఒంటరిగా తిరుగుతున్నారంటే అది ఎన్టీఆర్ చలవేనన్నారు. లక్ష్మీ పార్వతికి మాత్రం ఎన్టీఆర్ జయంతి వచ్చిదంటే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు సెటైర్లు వేసే వేదికగా మారిపోతోంది.
ఎన్టీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించలేదని, ఆయన వారసత్వాన్ని కూడా వ్యతిరేకిస్తారని, నేడు మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, ఒకప్పుడు మహానాడు అంటే పేదలకు ఎంతో కొంత మంచి జరిగేదని, కానీ నేడు జరుగుతున్న మహానాడు వెన్నుపోటు వారోత్సవాలని సెలవిచ్చింది. ఒకవైపేమో హరికృష్ణ మహిళలకు ఒంటరిగా తిరిగే ధైర్యం ఇచ్చింది తన నాన్నే అంటుంటే, లక్ష్మీ పార్వతి మాత్రం మహిళలకు రక్షణ లేదంటోంది.
ఇక ఈమె ఎన్టీఆర్ వారసత్వాలకు వ్యతిరేకం అంటోంది. మరి ఎన్టీఆర్ భార్యగా ఆమె, బాలకృష్ణను తన వారసుడిగా సినీ, రాజకీయాలలో ఎన్టీఆర్ ప్రకటించిన మాట లక్ష్మీ పార్వతికి తెలియదా? బాలయ్యే తన వారసుడిని ప్రకటించినప్పుడు ఇక వారసత్వ రాజకీయాలకు ఎన్టీఆర్ వ్యతిరేకంగా అని ఎలా అనుకోవాలి? జూనియర్ ఎన్టీఆర్ అయితే 'తాతకు ప్రేమతో' అంటూ ఎన్టీఆర్‌కి ధీటైన వారు రానేరారని చెప్పేశాడు. మొత్తానికి అందరూ కలిసి మనుషులను కూడా దేవుళ్లను చేస్తూ మనమీద వారి భావాలను రుద్దుతున్నారని చెప్పాల్సిందే.