మారుతి.. ఓ అనామకుడైన ఈ యువకుడు దర్శకునిగానే కాకుండా నిర్మాతగా కూడా తన కంటూ ఓ ప్రత్యేక పంధా చాటుకున్నాడు. డైరెక్టర్‌గా మారిన మొదట్లో కాస్త అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలను తీశాడు. దాంతో ఆయనపై బూతు దర్శకుడు అనే పేరు వచ్చింది. ఇక తాను ఘోస్ట్‌గా ఉండి 'ప్రేమ కథా చిత్రమ్' చిత్రాన్ని తీశాడు. ఇది ఓ సంచలనం. మరలా దేశవ్యాప్తంగా హర్రర్ కామెడీ చిత్రాలకు ఇది ఊపిరి పోసింది.
హర్రర్‌కి కామెడీని ఆయన జోడించిన విధానం అద్భుతమనే చెప్పాలి. ఇక ఆయన ఎక్కువగా కొత్త హీరో హీరోయిన్లు, నటీనటులతో చిత్రాలు చేస్తారు. లో బడ్జెట్‌లోనే మంచి క్వాలిటీతో చిత్రాలు తీసి నిర్మాతలకు కల్పవృక్షంగా మారాడు. అంతే కాదు.. తానే కథను అందించి, స్క్రీన్‌ప్లేను సమకూర్చి నిర్మాతగా మారి కొత్త దర్శకులకు, టాలెంట్ దర్శకులకు కూడా చాలా అవకాశాలు ఇస్తూ వచ్చాడు. ఇక ఆయన యువి క్రియేషన్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నాని హీరోగా నిర్మించగా, ఆయన దర్శకత్వం వహించిన 'భలే భలే మగాడివోయ్' చిత్రం సంచలన విజయం సాధించింది. ఆయన బూతునే కాదు.. ఆరోగ్యకరమైన కామెడీని ఫ్యామిలీ సెంటిమెంట్‌కు జోడించి కూడా తన సత్తా చూపించగలడని ఈ చిత్రం నిరూపించింది.
గత కొంతకాలంగా మారుతి కాస్త డౌన్‌ఫాల్‌లో ఉన్నాడు. వెంకటేష్‌తో చేసిన చిత్రం అనుకున్న విజయం సాధించలేకపోయంది. ఇక శర్వానంద్‌తో 'మహానుబాహుడు' తీయనున్నాడు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఆయన ప్రస్తుతం తానే నిర్మాతగా, 'రోజులు మారాయి' దర్శకుడు మురళి దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నాడు. సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 50శాతం పూర్తయిందట. ఇందులో ఇద్దరు కొత్త హీరోలు నటిస్తున్నారని సమాచారం. కాగా ఈ చిత్రానికి మారుతి 'ఆకలిరాజ్యంలో అంతులేని కథ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
'ఆకలిరాజ్యం, అంతులేని కథ' ఈ రెండు చిత్రాలను లెజెండరీ దర్శకుడు స్వర్గీయ బాలచందర్ తీశారు. రెండు ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. సమకాలీన పరిస్థితులను చూపిస్తూ, నిరుద్యోగ సమస్యతో పాటు పలు అంశాలను ఈ చిత్రంలో ఆయన చూపించనున్నాడని సమాచారం. మొత్తానికి మారుతి ఈ చిత్రం టైటిల్‌తోనే మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాడని చెప్పవచ్చు.