తమిళనాడు రాజకీయాలలో జయలలిత మరణం తర్వాత కరుణానిధి వయో వృద్దుడు కావడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీంతో తమిళ ప్రజల నుంచే కాక అందరూ రజినీకాంత్ అయితేనే తమిళ ప్రజలకు మేలు చేయగలడని, కాబట్టి ఆయన రాజకీయాలలోకి రావాలని గట్టిగా కోరుతున్నారు. కానీ ఇప్పటికీ రజినీ మౌనంగా ఉంటున్నాడు. దీనికి సరైన కారణం కూడా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే తమిళనాడు రాజకీయాలు భిన్నమైనవి.
అసలే రాజకీయాలంటే బురద అని రజినీ అభిప్రాయం. ఇంతకాలం తమిళనాడులో అందరివాడుగా ఉన్న తనను రాజకీయాలోకి దిగితే మురికికూపంలోకి లాగి తనను కూడా అప్రదిష్ట పాలుచేస్తారని ఆయన సందేహిస్తున్నారు. నిజంగానే నేడు రజినీ అభిప్రాయం నిజమేనని తెలుస్తోంది. ఇంతకాలం రజినీతో స్నేహంగా, ప్రేమగా ఉన్నవారు సైతం రజినీని ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కొందరేమో ఆయన ఇంకా మౌనంగా ఉంటున్నాడని, పిరికివాడని, నిర్ణయం తీసుకోలేని అసమర్ధుడని అంటుంటే మరోవర్గం వాదన మరింత విచిత్రంగా ఉంది. మొత్తానికి ఈ రెండు వాదనలు చేసే వారి మనసులో ఉన్నది ఒక్కటే రజినీ రాజకీయాలలోకి రాకూడదు.
ఆయన సీఎం కాకూడదు అనేదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. దీని వెనుక రాజకీయ హస్తం కూడా ఉందని అందరూ అనుమానిస్తున్నారు. కొన్ని రాజకీయ పక్షాలు, నాయకులు వెనుక ఉండి కొందరితో ఇలా మాట్లాడిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే రజినీకి సమకాలీకుడైన కమల్‌హాసన్ కూడా తన స్థాయిని మర్చిపోయి రజినీ కెమరా, మైకులు అంటే ఊగిపోతాడని... ఏవోవో కూతలు కూశాడు. తాజాగా తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజ అంతకంటే నీచమైన కామెంట్లు చేశాడు. బహుశా ఇలాంటి వ్యాఖ్యలను గతంలో ఎవ్వరూ అనలేదేమో అనే అనుమానం కూడా రాకమానదు.
ఆయన మాట్లాడుతూ.. తమిళనాడును పాలించే తమిళ నాయకులు సరైన వారు లేరని అంటున్నారు. నిజమేననుకుందాం. తమిళులను పాలించే మంచి నేతలు లేరు కాబట్టి మేమొచ్చి తమిళులను పాలిద్దామని అనుకుంటున్నారు. వారొచ్చి మమ్మల్ని ఏలాలని చూస్తున్నారు. మాలో మంచి నేతలు లేకపోతే మీరొచ్చి ఏం చేస్తారు? నా భార్య గర్భవతి కాలేదని చెప్పి నా బిడ్డకు తండ్రి కావడానికి నువ్వెవరు? ఏ విషయంలోనైనా భాగం అడగవచ్చు. కానీ నా పడక గదిలోనూ భాగం కావాలంటే ఎలా? అని తుచ్చమైన వ్యాఖ్యలను పెద్దమనిషి భారతీ రాజా చేశాడు.
మొత్తానికి రజినీని రాజకీయాలలోకి రాకుండా ముందుగానే అడ్డుకోవాలనేది వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. కర్ణాటకకు చెందిన రజినీ ఇంతకాలం తమిళ సినీ పరిశ్రమను ఏలడం, రాజకీయాల్లోకి వస్తే నిజంగానే ముఖ్యమంత్రి అవుతాడేమోనన్న ఈర్ష్యతోనే ఈ కామెంట్లు చేస్తున్నారు. వీటిని విన్న రజినీ చాలా మనస్తాపంతో ఉన్నాడని సమాచారం.