సీనియర్ ఆర్టిస్ట్ కోట శ్రీనివాస రావును ఎవరైనా విమర్శించాలంటే ముందుగా ఆయన తాగుబోతు అంటారు. గతంలో ప్రకాష్ రాజ్‌ను పొగిడే క్రమంలో క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ మీడియా ముఖంగానే కోటపై తాగుబోతు అనే ముద్ర వేశాడు. ఇక తాజాగా తన తాగుడుతనం గురించి కోట వివరించారు. వాస్తవానికి నేను బిజీ అయినప్పుడు మూడు నాలుగు షిఫ్ట్‌లు కూడా పనిచేసేవాడిని, ఇంటికి దూరంగా గడపాల్సివచ్చేది.
పెద్ద హీరోల చిత్రాలతే ఎక్కువగా సెట్స్‌లోనే షూటింగ్స్ చేసేవారు. ఇక ఎండాకాలమైతే చిన్న చిత్రాలలో నటించేటప్పుడు ఎక్కడైనా చెట్లు వెత్తుకుని ఆ ఎండలోనే మేకప్ వేసుకోవాల్సివచ్చేది. ఇలా నా పని పూర్తయ్యే సరికి రాత్రి2 గంటలు కూడా దాటేది. హోటల్‌బోయ్ సాయంత్రం 7గంటల కల్లా డిన్నర్ క్యారేజీని రూమ్‌లో పెట్టేసి వెళ్లిపోయేవాడు. ఇక నాకు సాయంత్రం అయ్యేసరికి పిల్లలు, భార్య గుర్తుకొచ్చేవారు. పిల్లలు ఏంచేస్తున్నారు? చదువుకుంటున్నారా? లేదా? భార్య ఎలా ఉంది? అనే ఆలోచనలు చుట్టుముట్టేవి.
ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ వ్యవస్థగానీ, వినోద సాధనాలు గానీ ఆ రోజుల్లో లేవు. దాంతో ఒకాయన రాత్రి పూట రెండు పెగ్గులు తాగు...మంచి నిద్ర వస్తుంది అని చెప్పాడు. దాంతో అర్ధరాత్రి 2గంటల వరకు షూటింగ్ పూర్తి చేసి రూమ్‌కి వచ్చి రెండు పెగ్గులు మాత్రమే తాగేవాడిని, హోటల్‌బోయ్ వదిలిపెట్టిన క్యారేజీలో ఏమీ తాకే వాడిని కాదు. వాసన వస్తూ ఉండేవి. ఒక్క పెరుగన్నం కొద్దిగా తినేవాడిని, అది కూడా పులుపెక్కి వాసన వస్తూ ఉండేది. ఏదోఒకటి అని రెండు ముద్దలు తిని నిద్రపోయే వాడిని. పడుకున్న పది పదిహేను నిమిషాలలో తెల్లారిపోయేది.
రూం బోయ్ వచ్చి గుడ్‌మార్నింగ్ చెప్పేవాడు. అప్పటికి నోటి నుండి రెండు పెగ్గుల వాసన, చెడిపోయిన పెరుగు వాసన.. ఇవ్వన్నీ వచ్చి కళ్లు ఎర్రగా మారిపోయేవి. దాంతో ఉదయం షూటింగ్‌కి వెళ్లితే కోట రాత్రంతా మందు తాగుతూనే ఉన్నాడు.. అనే వారు. అలా నాపై తాగుబోతు ముద్ర పడింది..అని ఆవేదన వ్యక్తం చేశాడు.