ఆధునిక సినీ వైతాళికులలో ఒకరు ఆదూరు గోపాలకృష్ణన్. కేరళకు చెందిన ఈ లెజెండరీ దర్శకుడు తాజాగా మాట్లాడుతూ, ఇంతకాలం హిందీయేతర చిత్రాలను ప్రాంతీయ భాషా చిత్రాలనీ, హిందీ సినిమాలను మాత్రమే ఇండియన్ సినిమా అంటూ పిలవడంపై మండిపడ్డారు. హిందీ కూడా దేశంలోని ఒక భాషేనని, ఆరకంగా చూసుకుంటే ఇండియాలో ఏ భాషలో నిర్మితమైనప్పటికీ వాటిని ఇండియన్ చిత్రాలనే అనాలని విజ్ఞప్తి చేశారు.
ఒక భాషలోని ప్రజలు ఇతర భాషల్లోని చిత్రాలు చూడటానికి ఇష్టపడకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం గర్వించదగ్గ దర్శకనిర్మాత సత్యజిత్ రేను ఎవ్వరూ బెంగాళీ దర్శకుడిలా భావించరని,ఆయనను ఇండియన్ గ్రేట్ డైరెక్టర్‌గానే చూస్తారన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇక ఒకానొక సందర్భంలో 'బాహుబలి' గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు తాను 1951లో వచ్చిన 'పాతాళభైరవి'లాగానే 'బాహుబలి'ని భావిస్తానని, 'బాహుబలి'ని చూసేందుకు తాను 10 రూపాయలు కూడా ఖర్చుపెట్టనని నిక్కచ్చిగా చెప్పాడు. ఈ వార్త తమిళ మీడియాలో బాగా ఫోకస్ అయింది. పలు తమిళ పత్రికలు, మీడియా కూడా 'బాహుబలి' మంచి చిత్రమేనని, కానీ అలాంటి చిత్రం ఇక ఎంతో కాలం రాదని, రాజమౌళి దెబ్బకు అందరూ పడుకున్నారని వస్తున్న వార్తలపై మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రీజినల్ సినిమాలకు పెద్దగా మార్కెట్ లేని తరుణంలోనే 'రోబో' చిత్రం సంచలన విజయం సాధించిందని, ఇక '2.0' విషయానికి వస్తే బాలీవుడ్‌లో ఇరగదీయడానికి అక్షయ్‌కుమార్ ఉన్నాడని, మిగిలిన భాషల సంగతి రజినీ చూసుకుంటాడని, కాబట్టి '2.0'ని తక్కువగా అంచనా వేయవద్దని, ఓ మోస్తరు చిత్రమే అయినా 'కబాలి' సృష్టించిన హైప్‌ను, కలెక్షన్లను గుర్తుపెట్టుకోవాలని తమిళ మీడియా తన అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఇందులో కూడా న్యాయం ఉంది..!