నేడు ఏ పెద్ద హీరో చిత్రం చేస్తున్నా కూడా అది ఇతర భాషల్లో తాము తీసిన చిత్రానికి కాపీఅనో, దాని ఆధారంగానే ఆ చిత్ర కథ రూపొందుతోందేమోనన్న అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత పోస్టర్‌ని బట్టి, గెటప్‌ని బట్టి, చూచాయగా తెలిసిన స్టోరీలైన్‌ని బట్టి ఏవేవో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీంతో పరభాషల్లోని ఆ చిత్ర నిర్మాతలు కూడా అది నిజమేనేమో అన్న అనుమానపు చూపులు చూస్తున్నారు.
ఇటీవలే 'మగధీర'ను పోలి ఉందని, బాలీవుడ్ మూవీ 'రాబ్తా'పై పెద్ద తతంగమే నడిచింది. ఇక తాజాగా ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్‌రామ్ నిర్మాతగా బాబి దర్శకత్వంలో 'జై లవ కుశ' అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక క్యారెక్టర్ అమాయకుడు కాగా మరో క్యారెక్టర్ బ్యాంకు ఉద్యోగి అని, మూడో పాత్ర నెగటివ్ ఛాయలతో ఉంటుందని ప్రచారం మొదలైంది. 'జై', 'లవ', 'కుశ' అనేవి పాత్రల పేర్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన 'వరలారు'కి కాపీ అంటూ ప్రచారం మొదలైంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న 'వరలారు' నిర్మాత ఏకంగా నిర్మాత కళ్యాణ్‌రామ్‌పై కేసు ఫైల్ చేద్దామనేంత వరకు తతంగం నడించిందంటున్నారు.
వెంటనే అప్రమత్తమైన నిర్మాత కళ్యాణ్‌రామ్ 'వరలారు' నిర్మాతకు 'జై లవ కుశ' స్టోరీని మొత్తం వినిపించడం, అది తమ చిత్ర కథ కాదనీ, అయినా స్టోరీ మాత్రం అద్భుతంగా ఉందని, ఈ చిత్రం తెలుగులో హిట్టయితే ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులను తనకే ఇవ్వాలని సదరు నిర్మాత కోరడంతో మరో ప్రమాదం తొలగిందని, ఈ చిత్రం ఖచ్చితంగా ట్రెండ్‌సెట్టర్ అవుతుందని యూనిట్ ఆనందంగా ఉంది.