బాలీవుడ్ నటీనటులకు, దక్షిణాది నటీనటులకు చాలా విషయాలలో వ్యత్యాసాలుంటాయి. ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచి వేరు.. మన దక్షిణాది ప్రేక్షకుల అభిరుచి వేరు. కథ, కథనాల నుంచి బాడీలాంగ్వేజ్, లుక్స్ వరకు వీరి అభిరుచి విభిన్నం. ఉత్తరాది వారు ఎక్కువగా ఆజానుబాహులను ఇష్టపడతారు. అలాగే మీసాలు లేకుండా ఉండే వారంటే అక్కడి వారికి మక్కువ ఎక్కువ. ఖాన్ త్రయం నుంచి పాత హీరోలందరూ ఎక్కువగా అలాగే కనిపిస్తారు. ఇక కొందరికి మీసాలు ఉన్నా ఆ గెటప్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. మీసాలు ఉన్నా లేకున్నా కూడా బాగుండేవారినే వారు తమ స్వంత మనుషులుగా భావిస్తారు.
కానీ దక్షిణాది వారికి ముఖ్యంగా తెలుగువారికి తమ హీరోలు మంచి మీసపు కట్టుతో ఉంటేనే ఇష్టపడతారు. గతంలో ఓసారి నాగార్జునను ఓ జర్నలిస్ట్ మిత్రుడు హిందీలో ఎక్కువగా ఎందుకు చేయలేకపోయారు? అంటే ఆయన నవ్వుతో అక్కడి దర్శకులు, ప్రేక్షకులు మీసాలు తీయమంటున్నారయ్యా.. అంటూ చమత్కరించాడు. ఇక మోహన్‌లాల్ తీస్తున్న 'మహాభారతం'లో శ్రీకృష్ణుని పాత్ర చేయవచ్చు కదా..! అంటే శ్రీకృష్ణుడు అంటే మీసాలు తీయాలి.. కాబట్టే కర్ణుడిని పాత్రను చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఇది వినడానికి చిన్న విషయంలాగానే కనిపించవచ్చు గానీ ఇది ఉత్తరాదివారి అభిరుచికి అద్దం పడుతుంది. ఇక మన పౌరాణికాల్లో శ్రీకృష్ణునికి తప్ప, భీముడిని, కర్ణుడిని..అందరినీ మనం మీసాలతోనే చూసి అలవాటు పడ్డాం. కానీ నాడు దూరదర్శన్‌లో వచ్చిన 'రామాయణం, మహాభారతం'లో మనం మీసాలతో ఊహించుకున్న వారు మీసాలు లేకుండా కనిపించారు.
ఇక యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్ 'బాహుబలి'లో మీసాలతోనే హిందీ ప్రేక్షకులను కూడా మెప్పించాడు. కానీ తన తదుపరి చిత్రం 'సాహో' కోసమేనన్నట్లుగా మీసాలు తీసేసి క్లీన్‌షేవ్‌లో కనిపిస్తున్న స్టిల్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఉత్తరాది కోసం ప్రభాస్ అలా మీసాలు తీసేస్తే మాత్రం ఆయనకున్న అసలైన అందమైన మీసాలు లేకపోతే బోసిపోయినట్లు కనిపిస్తున్నాడు. మరి ప్రభాస్ ఉత్తరాది వారి కోసం మీసాలు తీసేస్తే టాలీవుడ్ ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోవచ్చు. గతంలో 'చక్రం'లో మీసాలు తీసేసి, 'మున్నా'లో చిన్నపాటి మీసాలతో కనిపించి ప్రభాస్ మెప్పించలేకపోయాడు. మరి ప్రభాస్ ఉత్తరాదిని దృష్టిలో పెట్టుకుని మీసాలు తీసేసి కొత్తలుక్‌లో కనిపిస్తే మాత్రం ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోవచ్చు. తద్వారా రెంటికి చెడిన రేవడి అయ్యే ప్రమాదం పొంచి ఉంది.