తమిళ రాజకీయాల్లో సినీతారల హడావిడి ఎప్పుడు ఎక్కువే.. ఎంజీయార్ హయాం నుంచి సినిమా గ్లామర్ కీ తమిళ రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. ఇక తమిళ ప్రజలు కూడా ఎప్పుడూ సినిమా గ్లామర్ కే ఆకర్షితులవుతున్నారు. అందుకే ఎక్కువమంది సినీతారలు తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రెడీ అయిపోతున్నారు. అలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా తారలు తమిళనాడు రాజకీయాలను శాసించారు కూడాను. ఇక జయలలిత మరణం తర్వాత తమిళ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి. అయితే గతం గతహా అన్నట్టు ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో పాత వాసనలు పోయి కొత్త వాసనలు ముసురుకుంటున్నాయి.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాడంటూ వార్తలు హల్చల్ చేస్తున్న వేళ.... ఒకప్పుడు తమిళనాట అభిమానులతో గుడి కట్టించుకున్న ఖుష్బూ ఎప్పటినుండో రాజకీయాలపట్ల ఆకర్షితురాలై కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార ప్రతినిధి హోదా దక్కించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఖుష్బూ కాంగ్రెస్ ని వదిలి బయటికి వచ్చే ఆలోచన చేస్తుందని అందుకే.... 'కాలా' షూటింగ్ లో బిజీగా వున్నా రజినిని కలిసి రాజకీయాలు చర్చించినట్లు వార్తలొస్తున్నాయి.ఇక రజిని కూడా పార్టీ అంటూ పెడితే నీకు సముచిత స్థానం ఇస్తానని మాటిచ్చినట్లు ప్రచారం మొదలైంది.
ఖుష్బూ సంగతి అలా ఉంటే మరో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కూడా రజిని పార్టీలో చేరేందుకు సిద్ధమంటూ ప్రకటించింది. మరి రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఏమోగానీ రజిని కోసం తమిళనాట పెద్ద పెద్ద స్కెచ్ లే సిద్ధమవుతున్నాయి. మరో పక్క తమిళ రాజకీయ పార్టీలు అన్నాడిఎంకె , పన్నీరు సెల్వం వర్గ ఎమ్యెల్యేలు కూడా రజిని పార్టీ పెడితే జంప్ అవడానికి సిద్ధంగా వున్నారు. ఒక్క రజిని కోసం అక్కడ కొన్ని కోట్లమంది ఎదురు చూస్తున్నారుగాని రజిని మాత్రం నిర్ణయం తీసుకోకుండా ఇంకా సస్పెన్సునే మెయింటింగ్ చేస్తూ తనది ఏ దారో చెప్పకుండా క్షణ క్షణం ఉత్కంఠత ను రేపుతున్నాడు.