ప్రస్తుతం గోమాంసంతో పాటు వ్యవసాయానికి, పాడి పరిశ్రమకు ఉపయోగించే జంతువుల కబేళాలకు అమ్మకూడదని, ఒంటెలను కూడా ఆ లిస్ట్‌లో చేర్చిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు కేంద్రం దీనిని అమలు చేయడానికి మోదీ కృతనిశ్చయంతో ఉన్నాడు. కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నప్పటికీ మెజార్టీ ప్రజలు మాత్రం ఈ చర్యను అభినందిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది అభిప్రాయమే దేనికైనా ప్రాతిపదికగా చెప్పుకోవాలి. కాగా గోవధపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఎప్పటి నుంచో ఉద్యమిస్తూనే ఉన్నాయి. అది నేడు వచ్చిన ఆందోళన కాదు.
బ్రిటిష్‌ప్రభుత్వం ఇండియాను పాలించేటప్పుడు మనదేశస్తులను సైనికులుగా తీసుకుంది. ముస్లింలు వాడే తూటాలకు పంది మాంసాన్ని, హిందువు సైనికులకు ఆవు మాంసాన్ని పూసిన వస్తువులను ఇచ్చేది. అది ఆనాడు తీవ్ర వ్యతిరేకతను చూరగొంది. కాగా ఇటీవల ఓ సర్వేలో సిగరెట్లలో ఉండే ఫిల్టర్‌ను తయారు చేసేందుకు పంది కొవ్వును వాడుతున్నారని శాస్త్రవేత్తలు తేల్చారు. అంత మాత్రాన ఎవరైనా సిగరెట్లు మానుతున్నారా? ఇక విషయానికి వస్తే శ్యాంప్రసాద్ ముఖర్జీ రోజుల నుంచి గోవధపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఒకప్పటి తిరుపతి ఎంపీ చింతామోహన్ తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.
నాటి ప్రధాని వాజ్‌పేయ్ 1997లో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు తనను, బీఎస్పీ స్థాపకుడు కాన్షీరాంలను పిలిచి విందు ఇచ్చారని, దాంట్లో ఆయన గోవు మాంసాన్ని కూడా తమకు వడ్డించి తాను కూడా తిన్నాడని వ్యాఖ్యానించారు. అలా గోమాంసం తినబట్టే కాన్షీరాం స్థాపించిన బిఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి మాయావతి ముఖ్యమంత్రి అయ్యారని, అలా గోమాంసం తినడం వల్లే వాజ్‌పేయ్‌కి అన్ని కలిసి వచ్చి ప్రధాన మంత్రి కాగలిగారని అంటున్నాడు.
మరి చింతామోహన్ కూడా ఆ రోజు గోమాంసం తిన్నాడు కదా..! మరి ఆయన నేడు రాజకీయంగా పూర్తిగా ఎందుకు కనుమరుగైయ్యాడు? ఇక వాజ్‌పేయ్ ప్రస్తుతం మన స్పృహలో లేడు. దాదాపు బ్రెయిన్‌డెడ్ వంటి పరిస్థితి ఆయనది. ఇక వాజ్‌పేయ్ ఎప్పుడు గోవధ నిషేధం గురించే మాట్లాడేవారు. కానీ ఈరోజు ఆయన చింతామోహన్ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే స్థితిలో లేడు. మరోవైపు కాన్షీరాం కూడా మరణించాడు. మరి చింతామోహన్ వ్యాఖ్యలు ఎంత వరకు సమంజసమో ప్రజలే తేల్చాలి...!