రజినీకాంత్ హీరోగా 'కబాలి' ఫేమ్ రంజిత్ పా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'కాలా.. కరికాలన్' చిత్రం పుట్టకముందు నుండే రోజుకో సంచలనంతో హైలెట్ అయ్యింది. 'కాలా' గురించి అలా అనౌన్స్ అయ్యిందో లేదో ఆ సినిమా మీద అటెన్షన్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నాడు. 'కాలా' చిత్రాన్ని ఒకనాటి డాన్ హాజీ మస్తాన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారని ముందు నుండి ప్రచారం జరుగుతుంది. అందుకే డాన్ హాజీ మస్తాన్ కొడుకు తన తండ్రిని నెగెటివ్ గా చూపిస్తే అంతూ చూస్తానంటూ రజినీకి హెచ్చరికలు కూడా జారీ చేసాడు. అయినా కూడా రజిని 'కాలా' చిత్రాన్ని పట్టా లెక్కిస్తున్నాడు.
అలా షూటింగ్ మొదలైందో లేదో ఇలా ఈ 'కాలా' కథ నాదే అంటూ కె.రాజశేఖరన్ అనే వ్యక్తి బయటికి వచ్చాడు. ఇప్పటికే 'కాలా' మొదలైనప్పటి నుండి క్షణం విరామం లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక రజినీకాంత్ కూడా 'రోబో 2 .0' చిత్రం షూటింగ్ జరుగుతుండగానే ఈ 'కాలా' చిత్రాన్ని మొదలు పెట్టి యంగ్ స్టార్ లాగా షూటింగ్ చేసేస్తున్నాడు. ముంబై వీధుల్లో 'కాలా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్విరామంగా జరుపుకుంటున్న ఈ షూటింగ్ ఇప్పుడు నిర్మాత కె.రాజశేఖరన్ వలన బ్రేక్ పడే పరిస్థితి వచ్చింది.
'కాలా కరికాలన్' టైటిల్ కథ తనదని... నేను ఇంతకుముందే ఈ కథతో విక్రమ్ హీరోగా సినిమా చెయ్యాలనుకున్నా... కానీ కథ విన్న విక్రమ్ ఏం మాట్లాడకపోయే సరికి నేనే సైలెంట్ అయ్యా. కానీ ఇప్పుడు అదే కథ, టైటిల్ తో 'కాలా' చిత్రాన్ని రజినీకాంత్, రంజిత్ పా డైరెక్టర్ గా చేస్తున్నాడంటూ కోర్టులో కేసు వెయ్యడమే కాక... సినిమా షూటింగ్ నిలిపివేయించాలని కోర్టులో పిటీషన్ కూడా వేశాడు. ఈ పిటిషన్ ని స్వీకరించిన కోర్టు రజనీకాంత్, ఫిలిం మేకర్స్, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ఆప్ కామర్స్ కు నోటీసులు పంపింది.ఇక కేసును ఈనెల 16 కి వాయిదా వేసింది కోర్టు. మరి ఈ గండం నుండి రజిని 'కాలా' చిత్రం ఎలా గట్టెక్కుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.