దాసరి అనారోగ్యంతో గత వారం ఈ లోకాన్ని వదిలివెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అయితే దాసరి మరణం తర్వాత ఆయన్ని చివరిసారిగా చూడడానికి ఇండస్ట్రీలోని అతికొద్ది మందే రావడం చాలామందిని కలిచివేసింది. టాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఇతర దేశాల్లో ఉండడంతో చిరంజీవి, బాలకృష్ణ వంటివారు దాసరిని చివరి చూపు చూడలేకపోయారు. ఇక దాసరి దత్త పుత్రుడు మోహన్ బాబు.. దాసరిని అందరూ విస్మరించారని బాహాటంగానే విమర్శించాడు. ఇక దాసరి పరమపదించి 10 రోజులు గడుస్తున్నా ఆయనకు సరైన సంతాప సభ ఏర్పాటు చెయ్యలేదు.
అయితే దాసరి నారాయణరావు సినిమా పరిశ్రమ అన్ని భాగాల్లో పరిచయమున్న వ్యక్తి కాబట్టి అన్ని రంగాల వారు ఆయన్ని గౌరవించేవారు. కానీ ఆయన బ్రతికున్న రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని ఆదుకున్న వ్యక్తి చివరి దశలో మాత్రం కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆయన మరణించిన ఇన్నాళ్లకు ఈ ఆదివారం సాయంత్రం ఆయనకు 24 క్రాఫ్టుల వారు ఘనంగా సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ లోపు టాలీవుడ్ దర్శకుల అసోషియేషన్ వారు దాసరి సంతాప సభని ఏర్పాటు చెయ్యగా.... ఆ సభకు టాలీవుడ్ లో అతికొద్దిమంది చిన్న దర్శకులు మాత్రమే హాజరయ్యారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా చెప్పుకునే డైరెక్టర్ ఒక్కరూ దాసరి సంతాప సభకు హాజరుకాకపోవడం అనేది వారు ఆయన్ని ఎంతగా అవమానించారో...మళ్ళీ మళ్ళీ స్పష్టమవుతూనే వుంది.
మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ గా కొనియాడబడుతూ హీరోలతో సమానంగా కోట్లు అందుకుంటున్న ఒక్క డైరెక్టరూ ఈ సభకు హాజరు కాకపోవడమనేది ఇప్పుడు చర్చనీయంశమైంది. దర్శకుడుగా, నటుడిగా ఒక వెలుగు వెలిగి అందరికి గురువుగారుగా కీర్తింపబడిన దాసరిని ఇలా అందరూ నిర్లక్ష్యం చేయడమనేది టాలీవుడ్ కి ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.