రవిరాజా పినిశెట్టి.. తెలుగులో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దర్శకుడు. ఆయన దాసరి శిష్యుడు. ఈయన తన దర్శకత్వంలో 'జ్వాల, యముడికి మొగుడు' వంటి బ్లాక్‌బస్టర్స్‌ని తెరకెక్కించాడు. ఇక ఆరోజుల్లో తమిళ రీమేక్ అంటే అది రవిరాజా పినిశెట్టి చేయాల్సిందే. ఆకోవలోకి భీమినేని వచ్చేవరకు రవిరాజా పినిశెట్టి హవా నడిచింది. ముఖ్యంగా ఆయన కెరీర్‌లో మోహన్‌బాబు నటించిన 'పెదరాయుడు' చిత్రం అతి పెద్ద హిట్‌గా పేరొందింది. కానీ ఆయనకున్న పలుకుబడి ఇక్కడ ఆయన కుమారులకు ఉపయోగపడలేదు.
దీంతో ఆది పినిశెట్టి తమిళంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగా గుర్తింపు పొందాడు. కొన్ని తమిళ డబ్బింగ్స్‌తో పాటు 'గుండెల్లో గోదారి', 'మలుపు' చిత్రాలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో ఆయన ఇక తెలుగు లో ఎలా కొనసాగాలా? అని ఆలోచిస్తూ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అప్పటివరకు మిడిల్ ఏజ్‌డ్, ఏజ్‌డ్‌బార్ విలన్లతో విసిగిపోయిన ప్రేక్షకులు నాడు గోపీచంద్ విలన్‌గా మారినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో 'సరైనోడు'లో యంగ్ విలన్‌గా అదరగొట్టిన ఆది పినిశెట్టిని అలా పోల్చుకున్నారు. ఇక ఆ వెంటనే ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దృష్టిలో పడ్డాడు. త్రివిక్రమ్ చిత్రాలలో విలన్లు క్యారెక్టర్లు సైతం విభిన్నంగా, హీరోతో పోటీ పడేలా మంచి గుర్తింపును తెచ్చేలా ఉంటాయి.
దీంతో త్రివిక్రమ్.. పవన్ కోసం రాసిన కథలో కేవలం ఆదిపినిశెట్టిని దృష్టిలో పెట్టుకుని విలన్ పాత్రను అద్భుతంగా రూపొందించాడట. ఇక పవన్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో సినిమా అంటే దాని మైలేజే వేరుగా ఉంటుంది. కోట్లమంది దృష్టిలో పేరు తెచ్చుకోవచ్చు. దాంతోనే ఆది పినిశెట్టి ఈ పాత్రను కసితో చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం పవన్, ఆది పినిశెట్టిలపై ఓ స్టైలిష్‌ఫైట్‌ని తెరకెక్కిస్తున్నారు.
ఇదే సమయంలో తన ప్రతి చిత్రంలోని ప్రతి క్యారెక్టర్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే సుకుమార్, చరణ్ చిత్రంలో కూడా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో ఈ యంగ్‌విలన్ పేరు మారుమోగడం ఖాయం. ఇక మెగా కాంపౌండ్ అండతో ఈ నటుడు చెలరేగిపోవడానికి రెడీ అవుతున్నాడు...!