తెలుగు ప్రజలు రెండు మూడేళ్లు తమిళనాడులో లేదా కేరళలో ఉన్నా కూడా ఆయా భాషలను పూర్తిగా నేర్చుకోలేరు. కానీ తమిళులు, మలయాళీయులు మాత్రం.. తమ రాష్ట్రం నుంచి ఏ బయటి రాష్ట్రం లేదా దేశంలోకి వచ్చినా ఇట్టే కలిసిపోయి బతికేస్తారు. అంతేకాదు.. వారి మలయాళంను పక్కనపెట్టి తాము ఎక్కడ పనిచేస్తున్నామో ఆ భాషను స్పష్టంగా నేర్చుకొని బతికేస్తారు. అందంతో పాటు మలయాళ కుట్టిలు ఇంకా చాలా ఫాస్ట్.
ఇక విషయానికి వస్తే మలయాళ కుట్టి సాయిపల్లవి ఇప్పటి వరకుతెలుగులో ఒక్క చిత్రం కూడా చేయలేదు కానీ 'ప్రేమమ్'ద్వారా ఈమె జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఏళ్లకు ఏళ్లు ఇక్కడే ఉన్నా, లేదా అమెరికాలో చదివొచ్చిన వారు కూడా తెలుగులో కంటే ఇంగ్లీషులో మాట్లాడే హీరోలకు కొదువే లేదు. కానీ సాయిపల్లవి మాత్రం దిల్‌రాజు నిర్మాతగా మెగాహీరో వరుణ్‌తేజ్‌తో శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న తొలి చిత్రం 'ఫిదా'లో తానే డబ్బింగ్ చెప్పుకుంటూ ముద్దు ముద్దుగా ఉన్న తెలుగు పదాలను స్పష్టంగా పలికింది. ఇక తెలుగు రాష్ట్రాలలోనే అనేక మాండలికాలున్నాయి. తెలంగాణ, కోస్తా, రాయలసీమ, శ్రీకాకుళం వంటి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు ఇలా ఎన్నో యాసలు ఉన్నాయి.
'ఫిదా'లో సాయిపల్లవి అచ్చమైన తెలంగాణ యువతి పాత్రను పోషిస్తోంది. దాంతో అదే యాసతో 'బొక్కలిరగొడతా, బద్మాష్, బలిసిందేరా..' వంటి తిట్లను కూడా తిడుతోంది. వీలుంటే ఈ చిత్రంలో ఆమె చేత ఓ పాట పాడించే ఆలోచనలో కూడా దర్శకనిర్మాతలు ఉన్నారు. కాబట్టి.. సాయిపల్లవి నుంచి మనోళ్లు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది అనేది మాత్రం అక్షరసత్యం.