మనది ప్రజాస్వామ్యం. ఇక్కడ జరిగేది రహస్య ఓటింగ్ విధానం. మెజార్టీ ప్రజలు దేనికి ఓటు వేశారో ఆయా నియోజకవర్గాలలో గెలిచే అభ్యర్దులను బట్టి తెలుస్తుందే గానీ ఎవరు ఎవరికి ఓటేశారనేది మాత్రం తెలియదు. అలాగని ప్రతిపక్ష పార్టీలు గెలిచిన నియోజకవర్గాలు, జిల్లాలు, పట్టణాలను, గ్రామాలను పట్టించుకోకపోవడం అనేది సరైన సంప్రదాయంకాదు.
గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌కి ఎలాగూ ఏపీలో ఓటు వేయరని భావించింది. ఏపీలో టిడిపి, వైసీపీలకే గెలుపు అవకాశాలుండంతో తెలంగాణనైనా దక్కించుకునే నెపంతో విభజన చట్టం తెచ్చింది. ఇక్కడ తెలంగాణ ఇవ్వడం తప్పా? ఒప్పా అన్న విషయం పక్కనపెడితే ఎన్నోఏళ్ల నుంచి రగులుతున్న సమస్యను పరిష్కరించకుండా అగ్గిరాజేసి, పాలనలో ఉన్నంతకాలం దానిని మర్చిపోయి... ఎన్నికలు మరో కొన్నిరోజుల్లో ఉన్నాయనగానే హడావుడిగా ఎవరితోనూ చర్చించకుండా, మేధావుల సలహా తీసుకోకుండా పార్లమెంట్ తలుపులు మూసి కాంగ్రెస్, బిజెపిలు నాటకం ఆడాయి. చివరకు హడావుడిగా విభజన చేశారు.
ఇక బిజెపి ఎప్పటి నుంచో చిన్న రాష్ట్రాలకే మద్దతు ఇస్తూ ఉంది. మరి వాజ్‌పేయ్ హయాంలోనే తెలంగాణ విభజన ఎందుకు చేయలేదు? కేవలం నాటి ఎన్డీఏ ప్రభుత్వం టిడిపిపై ఆధారపడి ఉండటం, చంద్రబాబు విభజనకు వ్యతిరేకి కాబట్టే ఆ నిర్ణయం నాడు వాజ్‌పేయ్ తీసుకోలేకపోయారు. ఇక తమిళనాడుతో పాటు పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌నుంచి అందరూ ప్రజలు విభజన కోరుతుంటే బిజెపి ఎందుకు మౌనంగా ఉంది? మోదీ చిన్న రాష్ట్రాల పేరుతో యూపీని, పశ్చిమబెంగాల్‌ను ఎందుకు విడగొట్టలేకపోతున్నారు? ఇవ్వన్నీ ఓటు రాజకీయాలు.
ఇక ప్రత్యేకహోదా ఇస్తామన్న మోదీ ఏపీకి నేడు కేవలం ప్రత్యేక ప్యాకేజీతోనే ఎందుకు సరిపెట్టారు? అది కూడా రాజకీయ ఓటు బ్యాంకు కుట్రే. కేంద్రంలో బిజెపికే పూర్తి మెజార్టీ ఉండటం, ఏపీకి మాత్రమే ప్రత్యేకహోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అదే డిమాండ్ చేస్తే తమకు ఓటు బ్యాంకు పోతుందని భయం. అదే 2014 ఎన్నికల్లో మోదీకి పూర్తి మెజార్టీ రాకుండా టిడిపి మీద ఎన్డీయే మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేవారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికున్నంతకాలం సోనియా ఎందుకు రాష్ట్రాన్ని విభజించలేకపోయింది? ఆయన మరణం తర్వాతనే ఎందుకు విభజించిందనేది కూడా ఓటు బ్యాంకు రాజకీయమే.. ఇకనైనా ఈ ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రజలు పూర్తిగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది...!