'బాహుబలి' తర్వాత అందరూ తమ చిత్రాలను పలు భాషల్లో రూపొందించి విడుదల చేసే ప్లాన్‌లు చేస్తున్నారు. కానీ 'బాహుబలి'లో తెలుగు ప్రేక్షకులకు తెలియని, కేవలం బాలీవుడ్ మార్కెట్ కోసం కొని తెచ్చుకుని కోట్లు ఇచ్చిన నటీనటులు ఎవ్వరూ లేరు. అనుష్క, సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ.. ఇలా పాత్రకు తగ్గ నటీనటులను ఎంచుకున్నాడు రాజమౌళి. సంగీత దర్శకుడు కూడా ఏ.. రెహ్మానో కాదు.. కీరవాణియే. కథ తన తండ్రిదే.
కానీ ఈ 'బాహుబలి' మేనియాలో పడి మన దక్షిణాదిన అందరూ బహుభాషా చిత్రాలను తీస్తే తీయవచ్చు గానీ కేవలం అన్ని భాషల క్యాస్టింగ్ ఉంటేనే హిట్ అవుతుందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. రజినీ ఎప్పటి నుంచో బాలీవుడ్ టాప్ హీరోయిన్లు, సంగీత దర్శకుల వెంటపడుతున్నాడు. 'బాహుబలి'లో మూల స్థంభాలైన ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ వీరెవ్వరూ పెద్దగా పేరులేని మొహం చూసిన గుర్తులేగానీ హిందీల్లో స్టార్స్ కాదు.
ఇక 'సాహో' నుంచి 'ఉయ్యాలవాడ' ఇటీవల వచ్చిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో హేమమాలిని.. ఇలా ప్రయాణం సాగుతోంది. ఇక తాజాగా 'విఐపి2' ఆడియో, ట్రైలర్‌లను ముంబై వెళ్లి అదే పనిగా చేయించారు. ఈ సినమాలో కీలక పాత్రను కాజోల్ చేస్తోంది. ఇది బాలీవుడ్ మార్కెట్ కోసమేనని అర్ధమవుతోంది. ఎంత కష్టమైనా, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అయినా కూడా అలాంటి పాత్రలు చేసేవారు దక్షిణాదిలో లేరా? రమ్యకృష్ణ 'శివగామి' గానే కాదు. 'నరసింహ'లో చేసినంత పవర్‌ఫుల్‌గా ఎవరైనా చేయగలరా? ఇంకా భానుప్రియ నుంచి మన పాతతరం నటీమణులు ఎందరో ఉండగా కాజోల్ ఎందుకు? ఆమె నటించిన 'మెరుపు కలలు'లో ఆమె నటన ఏమైనా సినిమాను ఆడించిందా?
'కొచ్చాడయాన్'కు దీపికా పడుకొనే వల్ల వచ్చిన లాభమేంటి? 'లింగ' విజయానికి సోనాక్షిసిన్హా ఏమైనా తోడ్పడిందా? చివరకు మణిరత్నం 'ఇద్దరు, విలన్' చిత్రాలు బాగా ఆడాయా..? కథలో దమ్ముండాలే గానీ కంటెంట్‌ను నమ్మకుండా క్యాస్టింగ్‌ని నమ్ముకుంటే కోట్లకు కోట్లు చిలుము తప్ప పదిపైసల ఉపయోగం ఉండదు. 'పులి'లో శ్రీదేవి చేసినట్లు పులిహోర కథను నమ్ముకుంటే అంతే సంగతులు..!