రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీని తమిళ రాజకీయ నాయకులు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో తమిళ సినిమాపరిశ్రమ పెద్దలు కూడా అంతే వ్యతిరేకిస్తున్నారు. రజినీకాంత్ సినిమాలో నటించడం వలన ఆయన డబ్బు కూడ బెట్టుకున్నాడే కానీ ఆయన సినిమాలో నటించడం వలన ఎవరికీ ఉపయోగం లేదని తమిళ సినీ పెద్దలు గొంతు చించుకుంటున్నారు. అలాగే రజిని స్థానికత మీద కూడా తమిళనాట సినిమా పరిశ్రమలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతున్న విషయం విదితమే. ఇక రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం పక్కా అంటూనే అది ఎప్పుడో క్లారిటీ లేక చాలామంది తికమక పడుతున్నారు.
అయితే రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై నటుడు శింబు తండ్రి, దర్శకుడు టి.రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజేందర్, రజినీని ఉద్దేశించి జీఎస్టీపై ప్రశ్నించలేకపోయిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నిస్తున్నాడు. జీఎస్టీ వల్ల తమిళ సినీ పరిశ్రమ సర్వనాశనం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రజిని సినిమాల మీదే ఎంతో ఎత్తుకు ఎదిగారని... అన్నీ ఇచ్చిన సినీ పరిశ్రమ గురించి ఆయన అస్సలు ఆలోచించరని ఆరోపించారు. అలాంటాయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏం సేవ చేస్తారని ఎద్దేవా చేశారు. రజిని ఇప్పటికైనా జీఎస్టీపై పెదవి విప్పాలని రాజేందర్ డిమాండ్ చేశారు.
మరి గతంలో తమిళ టాప్ డైరెక్టర్ భారతి రాజా కూడా రజినీకాంత్ రాజకీయాలకు పనికిరాడని బహిరంగంగా విమర్శించిన సంగతి తెలిసిందే. గతంలో కూడా శింబు తండ్రి రాజేందర్.. రజిని రాజకీయ రంగ ప్రవేశంపై ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు. ఆయన అసలు తమిళుడే కాదని, అటువంటి వ్యక్తికి తమిళ ప్రజలపై పెత్తనం చలాయించే హక్కు లేదని రాజేందర్ విమర్శించిన సంగతి తెలిసిందే.