స్టార్‌హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై వస్తున్న విమర్శలకు చెక్‌పెట్టిన చిత్రం 'టెంపర్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో కాస్త నెగటివ్ టచ్ ఇచ్చిన తీరు ప్రేక్షకులను, అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటవిశ్వరూపం కనిపించింది. దీంతో ఎన్టీఆర్ మైండ్‌సెట్ కూడా బాగా మారింది. రొటీన్ రోతకొట్టుడు చిత్రాల నుంచి సుకుమార్‌తో 'నాన్నకుప్రేమతో', కొరటాల శివతో 'జనతాగ్యారేజ్'లలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలే కాదు... ప్రేక్షకుల ఆదరణ, అవార్డులు, రివార్డులు లభించాయి.
ఇక 'జనతాగ్యారేజ్' చిత్రమైతే ఎన్టీఆర్ కెరీర్‌లో అతి పెద్ద హిట్‌గా నమోదైంది. ఇక ఒకప్పుడు మంచి చిత్రాలకు, ప్రేక్షకులు మెచ్చిన చిత్రాలకు కాకుండా, ఎప్పుడు వచ్చిందో..ఎప్పుడు పోయిందో తెలియని ఆర్ట్ ఫిల్మ్‌టైప్ మూవీకే అవార్డులు వస్తాయనే పేరుండేది. కానీ నేడు అవార్డు నిర్ణేతల తీరు కూడా మారింది. కమర్షియల్ చిత్రాలలో కూడా మంచి నటన కనబరిచిన వారికి అవార్డులు వస్తున్నాయి.
ముఖ్యంగా తాజా అవార్డుల విషయంలో 'జూనియర్' మేనియా నడుస్తోంది. 'జీతెలుగు' నుండి బాక్సాఫీస్ కింగ్, 'శంకరాభరణం' తులసి ఇస్తున్న శంకరాభరణం అవార్డు, ఐఫా అవార్డులు ఆయన్నే వరించాయి. తాజాగా సైమా అవార్డు కూడా ఎన్టీఆర్‌నే వరించింది. దీంతో ఎన్టీఆర్‌తో పాటు ఆయన అభిమానులు కూడా ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.
మంచి చిత్రాలు, మంచి నటన చూపిస్తే రివార్డులతో పాటు అవార్డులు కూడా వస్తాయని ఎన్టీఆర్ నిరూపిస్తున్నాడు. బహుశా ఇదేనేమో ఆయనను 'జై లవకుశ'లో నెగటివ్ రోల్‌ను చేసేందుకు ప్రేరేపించి ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇంతకాలం రొటీన్ చిత్రాలతో మూసగా తయారైన ఆయన కెరీర్ ఒక్కసారిగా మంచి టర్న్ తీసుకుందనే చెప్పాలి..!