నేడు పెద్ద పెద్ద స్టార్స్ చిత్రాలు కూడా 25రోజులు ఆడాలంటే నానా తతంగం నడుస్తోంది. 25వారాల సినిమాలు పక్కనపెడితే 25రోజలు పోస్టర్లు కూడా తక్కువైపోయాయి. ఎవరో కొందరు పెద్ద హీరోలు, నిర్మాతలు పంతాల కోసం ఆడిస్తారు గానీ అది పెద్ద జోకేనని అందరికీ తెలుసు. ఎందుకంటే ధియేటర్లలో విడుదలైన రెండు నెలల్లో టీవీలో వచ్చేసేటప్పుడు 'ఓ సినిమా'.. ఇంకా ఫలానా చోట ఫలానా థియేటర్‌లో ఆడుతోంది అంటే నమ్మేవారు లేరు కదా..! నవ్వుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిత్రంగా వచ్చిన ఇంద్రగంటి మోహన్‌కృష్ణ 'అమీతుమీ' చిత్రం ఏకంగా 60 కేంద్రాలలో 25రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. చిన్న సినిమాలను ఎదురు డబ్బులిచ్చి ఆడిస్తారని వాదించినా అది నిజం కాదు. కాగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ తీసిన 'అష్టాచెమ్మా' తర్వాత వచ్చిన ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. 'జెంటిల్ మేన్' కూడా హిట్టయినా అదేమీ కామెడీ మూవీ కాదు. ఇక అమీతుమీకి రివ్యూలు కూడా బాగానే వచ్చాయి.
వెన్నెలకిషోర్, అడవి శేషు, శ్రీని అవసరాల వంటి నటులు ఈ చిత్రానికి నిండుదనం తెచ్చారు. ఇలాంటి విజయాలతోనైనా ఇంద్రగంటితో పాటు శ్రీనివాస్ అవసరాలతో పాటు పలువురు దర్శకులు నిజంగా నవ్వించే చిత్రాలను మరిన్ని ఉత్సాహంగా తీస్తారనే ఆశలు రేగుతున్నాయి.