బోయపాటి శ్రీను అంటే మాస్‌కి ఇంకా చెప్పాలంటే ఊరమాస్‌కి కేరాఫ్ అడ్రస్. హీరోయిజాన్ని ఆయన పీక్స్‌లో చూపిస్తాడు. ఈ విషయంలో బి.గోపాల్, వినాయక్‌లతో ఆయన పోటీ పడుతున్నాడు. ఇక మాస్‌హీరోగా అవతారం ఎత్తాలని భావిస్తున్న యంగ్‌హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ని బోయపాటి ఎలా చూపిస్తాడో అనే ఆసక్తి ఈ చిత్రం మొదలైనప్పుడు కలిగింది. సాయిశ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ కూడా తన గోల్ తన కుమారుడిని మాస్‌హీరోగా నిలబెట్టడమేనని, ఇతర హీరోలకు కోట్లు ఖర్చుపెట్టిన తనకు.. తన కుమారుడి చిత్రానికి వందకోట్లయినా వెనుకాడనని గతంలో ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
కానీ ఈ చిత్రానికి 'జయ జానకి నాయక' అనే టైటిల్‌ను అనౌన్స్ చేయగానే అందరూ ఆశ్చర్యపడిపోయారు. కాస్త పొయిటిక్ టచ్‌తో ఉన్న టైటిలే కాదు... సినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్‌తో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కలిసి ఉన్న ఫొటోలు కూడా క్లాస్‌టచ్‌లోనే కనిపించాయి. దీంతో అందరూ ఇది అసలు బోయపాటి శ్రీను సినిమానేనా? అనే అనుమానం వ్యక్తం చేశారు. బోయపాటి తనకుచేతగాని రొమాంటిక్, క్లాస్ మూవీని బెల్లంకొండసాయిశ్రీనివాస్ సినిమాతో ప్రయోగం చేస్తున్నాడా? అనే అనుమానాలు ఏర్పడ్డాయి.
కానీ తాజాగా ఈ చిత్రం కోసం విడుదల చేసిన హీరో సాయిశ్రీనివాస్ లుక్‌లో బోయపాటి తాను మాస్‌ని, ఊరమాస్‌ని వదిలేది లేదని చెప్పకనే చెబుతున్నాడు. కొత్తగా విడుదల చేసిన రిలీజ్‌డేట్ పోస్టర్స్ లో సాయిశ్రీనివాస్ లుక్, స్టైల్, చేతికండలు చూస్తుంటే మరోసారి 'సరైనోడు' గుర్తుకు రాకమానడు. ఇక ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్, కేధరిన్, ప్రగ్యాజైస్వాల్‌లు అడ్డులేకుండా గ్లామర్‌ని ఆరబోశారు. నిన్నటివరకు ఇది బోయపాటి ప్రయోగమని పట్టించుకోని బయ్యర్లు.. ఈ తాజా పోస్టర్ చూసి రిలాక్స్ అయి బిజినెస్ కోసం పరుగులు తీస్తున్నారట. మరి వినాయక్ చేయలేని పనిని బోయపాటి శ్రీను చేయగలడా? లేదా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.