ప్రతి తెలుగు నవల, సినిమా వారికి యండమూరి వీరేంద్రనాద్ అంటే ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. నాడు నవలల ద్వారా, ఆ నవలలను చిరంజీవితో తీసిన చిత్రాల ద్వారా ఆయన అందరికీ సుపరిచితుడే. కానీ ఈమధ్య బుల్లితెర ఉధృతం కావడంతో ఆయన నవలలు రాయడం మానేసి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాస్తున్నాడు. ఆ మధ్య ఎన్టీఆర్ 'శక్తి' కి కూడా పనిచేశాడు. ఇక చిరంజీవి 'ఖైదీనెంబర్ 150' వేడుకల్లో నాగబాబు యండమూరిపై చెలరేగడంతో మరలా యండమూరి వెలుగులోకి వచ్చాడు.
ఇక తాజాగా ఆయన టీవీ సీరియల్స్‌లో భార్యాభర్తల సంసారాలను సరిదిద్దే కార్యక్రమాలపై మండిపడ్డాడు. పలు పేర్లతో పలు చానెల్స్‌లో పోసాని, సుమలత, జీవిత, రోజాలు ఇలాంటి షోలు చేస్తున్నారు. విమర్శల కారణంగా సుమలత, జీవితలు దూరంగా ఉన్నా రోజా మాత్రం ఇలాంటి వాటిల్లో చేస్తూనే ఉంది. వీటిని చూస్తున్న వారు నిజంగా భార్యాభర్తలేనా? లేక టీవీ వారు డబ్బులిచ్చి అలాంటి వారిని తెస్తున్నారా? అనే అనుమానం కూడా కలుగుతోంది. ఇక నాలుగుగోడల మధ్య పరిష్కరించాల్సిన ఇంటిగుట్లను... మరీ నాలుగుకోట్ల మంది ఎదుట రచ్చచేయడం విమర్శలకు తావిస్తోంది.
ఇక ఈ కార్యక్రమంలో వినిపించే మాటల కంటే బూతుల స్థానంలో బీప్ సౌండ్స్, మొదటి అక్షరం, చివరి అక్షరం మాత్రమే వినిపించి షో నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై యండమూరి విరుచుకు పడ్డారు. ఇందులో పాల్గొంటున్న జడ్జిల వ్యక్తిగత జీవితాలు తనకు తెలుసని, మనస్పు ఆహ్లాదంగా ఉండేవారు వీటిని చూసి మానసిక ప్రశాంతతను కోల్పోవద్దని, ఇందులో పాల్గొనే సైక్రియాటిస్ట్‌లు కూడా తనకు బాగా పరిచయమేనని తెలిపాడు.
మరోవైపు ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న చానెల్స్ శవాలపై డబ్బులు ఏరుకునే రకమని ఘాటు సమాధానం ఇచ్చాడు. ఇక్కడ యండమూరి వ్యాఖ్యలతో అందరూ ఏకీభవిస్తున్నారనే చెప్పాలి.