వాస్తవానికి మలయాళ నటిపై లైంగిక దాడి కేసులో మొదట మీడియా కూడా అత్యుత్సాహం చూపి ఆమె పేరును వేశారు. కానీ నిబంధల ప్రకారం లైంగిక వేధింపులకు గురైన మహిళల పేర్లను రాయకూడదు. అందుకే 'నిర్భయ' అనో, మరోటి అనే రాస్తుంటారు. ఈ విషయంలో మొదట తప్పు చేసింది మీడియానే. ఇక కమల్ ఊరికే ఉంటాడా? తాజాగా ఆయన లైంగిక వేదింపులపై మాట్లాడుతూ, ఆ నటి పేరును ప్రస్తావించాడు.
కానీ మీడియా వెంటనే ఆమె పేరు బహిరంగంగా చెప్పకూడదని అనడంతో ఏం? ఎందుకు అనకూడదు? ఆమెను నేను బాధితురాలైన ఓ మహిళగా మద్దతు తెలుపుతున్నానే గానీ, ఆమె ఏదో సినీ నటి అని ప్రత్యేకంగా చూసి కాదు. మీరు కావాలంటే ద్రౌపది అని రాయండి. అంతేగానీ ఓ మహిళ అని మాత్రం అనవద్దు అని మాట్లాడాడు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ మండిపడింది. కమిషన్ చైర్పర్సన్ లలిత కుమార మంగళం తీవ్రంగా కమల్ చర్యను తప్పుపట్టింది.
ఆయన గొప్పనటుడే కావచ్చు. కానీ చట్టం ప్రకారం లైంగిక బాధితురాలి పేరును చెప్పడం నేరం. దీనికి గాను ఆయనకు జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించే విధంగా చట్టం ఉంది. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు. ఆ మహిళ గానీ ఆమె అభిమానులు గానీ కేసు నమోదు చేస్తే విచారణకు తీసుకుంటాం. ఆయన క్షమపణ చెప్పాలి. లేకపోతే దీనినే మేము సుమోటోగా స్వీకరించి కేసు ఫైల్ చేయాల్సివస్తుంది అని కమల్ని హెచ్చరించింది. మరి మొదట పేరు రాసిన మీడియాపై ఏం చర్యలు తీసుకోవాలి? మొదట నుంచి పలు వివాదాలకు, చర్చలకు దారి తీసిన ఈ నిబంధన ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.