పూరి జగన్నాధ్ డ్రగ్ కేసులో నోటీసులు అందుకుని బుధవారం ఉదయం సిట్ అధికారుల ముందు హాజరైన విషయం తెలిసందే. పూరి జగన్నాధ్ సిట్ అడిగిన ప్రశ్నలకు తడబాటు లేకుండా ఆచి తూచి జవాబులు చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే సిట్ అధికారులు ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ నేపథ్యంలో జరిగిన విచారణలో పూరికి ఏకంగా 100 నుండి 500 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది. ఇక పూరి కూడా వాటికీ సమాధానాలు చెప్పినట్టు కూడా చెబుతున్నారు. ఉదయం 10.30 నుండి రాత్రి 9 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది (మధ్యలో లంచ్ కి బ్రేక్ ఇచ్చారు). ఇక ఈ విషయాన్నీ మీడియా ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ లతో హడావిడి కూడా చేసింది.
అయితే 9 గంటలకు సిట్ విచారణ ఎదుర్కొని బయటికి వచ్చిన పూరి నేరుగా ఇంటికి వెళ్లిపోయి అర్ధరాత్రి ఒక వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. తనకు డ్రగ్ అలవాటు లేదని... ఇకముందు కూడా అలవాటు చేసుకోనని... అసలు డ్రగ్ డీలర్ కెల్విన్ తో సంబంధం లేదని.... ఈవెంట్ లో కొంతమందితో సంబంధం ఉన్నా అది సినిమా వరకు పరిమితమంటూ... మీడియా వారు నన్ను చాలా బాధపెట్టారని చెప్పాడు.
డ్రగ్ కేసులో నోటీసులు వచ్చినా కేర్ చెయ్యలేదని... ఎందుకంటే తనకు వాటితో సంబంధం లేదని... కానీ నా అనుకునే మీడియా మిత్రులు తనని మోసం చేశారని... తన జీవితంలో ఇప్పటి వరకు మీడియా ఎంతగానో కోపరేట్ చేసిందని... కానీ ఈ విషయంలో మీడియాలో వచ్చిన రకరకాల కథనాలకు తన తల్లి, భార్య, కొడుకు, కూతురు చాలా వేదన చెందారని...మా కుటుంబమే కాదు..ఇప్పుడు చెబుతున్న అందరి కుటుంబాలలో ఇదే పరిస్థితి అని పూరి ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం ఇదంతా మీడియా వల్లనే జరిగిందని అక్కసు వెళ్లగక్కాడు.