ఆగస్ట్ 25న విభిన్న చిత్రాల హీరో నారారోహిత్ 'కథలో ఒక రాజకుమారి' అనే వైవిధ్యమైన కథ, లుక్‌తో రానున్నాడు. నెలరోజుల ముందుగానే ఈ చిత్రం సెన్సార్‌ని కూడా పూర్తి చేసి రెడీగా ఉంచారు. ఇక ఇందులో నాగశౌర్య కూడా కీలకపాత్రలో నటించనున్నాడు. పోస్టర్స్, టైటిల్ లోగో నుంచి అన్ని విభిన్నంగానే కనిపిస్తున్నాయి. దీనిని మొదట సోలో రిలీజ్‌గా భావించారు.
కానీ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం'లతో పరిచయమై తన నటనతో పాటు వైవిధ్యంపై దృష్టి పెట్టి 'పెళ్లి చూపులు'తో పెద్ద హిట్ అందుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'అర్జున్‌రెడ్డి' పోటీకి వస్తుంది. ఈ చిత్రం టీజర్‌ని చూస్తే ఇందులో ఆయన ఎంట్రీ మామూలు కమర్షియల్ చిత్రాలలోలాగా కాకుండా డిఫరెంట్‌గా ఉంది. ఇదో సైకాలాజికల్ చిత్రమట. ఇందులో హీరో ఓ కోపం ఆపుకోలేని మనస్తత్వం ఉన్నవాడు. మరి అంత కోపం ఉన్నవాడు డాక్టర్ ఎలా అయ్యాడు? ఎందుకు అయ్యాడు? అనే పాయింట్‌ని ఎంతో ఇంటెలిజెంట్‌గా చూపించారని అంటున్నారు.
ఇక ఈచిత్రం థియేటికల్ రైట్స్‌ని ఏషియన్ ఫిల్మ్స్‌కి చెందిన సునీల్ నారంగ్, కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు తీసుకోవడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. దీంతో భారీ ఎత్తునే రిలీజ్ ఉంటుందని భావించవచ్చు. మరోవైపు ఇద్దరు వైవిధ్యమైన హీరోలు నటిస్తున్న ఈ వైవిధ్య చిత్రాలలో ఏది దూసుకెళ్తుందో వేచిచూడాల్సివుంది...!