మహేష్ బాబు డబ్బుల విషయంలో చాలా గట్టి అని, తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అడిగినవారికి, అడగని వారికి కూడా ఎంతో సాయం చేసి తన మంచితనం వల్లనే దెబ్బతినడంతోనే ఆర్ధిక విషయాలలో మహేష్ ఎంతో జాగ్రత్తగా ఉంటారనే వ్యాఖ్యలు ఎప్పటినుంచో ఆయనపై ఉన్నాయి. సినిమాలతో పాటు నిర్మాణం, ప్రకటనలు, బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.
కానీ ఆయన తన సంపాదనలో 25 శాతం కేవలం సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తాడు. హైదరాబాద్‌లో తన కుమారుడు జన్మించే విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్న రెయిన్‌బో హాస్పిటల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉచితంగా పనిచేస్తున్నాడు.ఇక గ్రామాల దత్తత కూడా తెలిసిందే. తాజాగా మహేష్ బాబుకి చెందిన మరో ఆసక్తికర వ్యాఖ్య హల్‌చల్ చేస్తోంది. ఆయన త్వరలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌ని స్థాపించి విద్యాదాతగా మారనున్నాడు. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పేద తెలివిగలిగిన విద్యార్ధులను ఆయన ఈ స్కూల్‌లో చేర్చుకుని తనవంతు సామాజిక సేవ చేయనున్నాడు.
ఈ స్కూల్‌ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నెలకొల్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆయన స్నేహితులు కూడా పార్ట్‌నర్స్‌గా ఉంటారని, మహేష్ స్లీపింగ్ పార్ట్‌నర్‌గా ఆర్ధిక నిధులను చేకూర్చడంతో పాటు ఈ స్కూల్‌కి చెందిన పబ్లిసిటీ, ప్రచార కార్యక్రమాలకు కూడా ఆయన స్వచ్చంధంగా పనిచేయనున్నాడు. టాలీవుడ్‌లో నిన్నటిదాకా మోహన్‌బాబు మాత్రమే పాఠశాలలు, కాలేజీలు నడుపుతూ విద్యాదాత పేరును తెచ్చుకున్నాడు. ఇప్పుడు మహేష్ కూడా ఈ విషయంలో ఓ అడుగు ముందుకేయడం ఎంతో హర్షించదగ్గ పరిణామననే చెప్పాలి...!