తమిళ 'బిగ్ బాస్' రియాల్టీ షో పలు వివాదాలకు కారణమవుతోంది. ఈ షోలో పార్టిసిపెంట్స్ ఏ విధమైన వివాదాస్పద కామెంట్స్ గానీ, చేష్టలు గానీ చేసినా దానికి ఈ షోని హోస్ట్ చేసే బిగ్‌బాసే దీనికి కారణమవుతాడు. తాజాగా కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో తమిళ సంస్కృతి, సంప్రదాయాలను అవమాన పరిచారని ఓ వ్యక్తి కమల్ హాసన్‌పై ఏకంగా 100 కోట్ల పరువు నష్టం దావా వేయడం తమిళనాడులో సంచలనం సృష్టిస్తోంది.
'పుతియ తమిళగం' అనే తమిళ సంస్థ నాయకుడైన కృష్ణమూర్తి ఈ పిటిషన్‌ని వేశాడు. కమల్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో తమిళ ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పరువు నష్టం దావాకు కారణం ఇందులో పార్టిసిపెంట్‌గా ఉన్న గాయత్రి రఘురామ్ చేసిన వ్యాఖ్యలేకారణం. ఆమె వ్యాఖ్యలు పలు దుమారాలకు దారి తీశాయి. తమిళ పేద ప్రజల గురించి గాయత్రీ రఘురాం పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వారిని అవమానించే విధంగా మాట్లాడారని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ దావాను వేసిన కృష్ణమూర్తి గతంలో కూడా కమల్ చేత మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఓ సినిమా టైటిల్ విషయంలో ఆయన కమల్‌పై పోరాటం చేసి విజయం సాధించాడు. కమల్ హాసన్ తాను నటించే చిత్రానికి 'సందియార్' అనే టైటిల్ పెట్టడం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఈ టైటిల్‌ని 'విరుమండి'గా మార్చేలా కమల్‌పై ఒత్తిడి తెచ్చి తాననుకున్నది సాధించాడు. దీంతో ఈ పరువు నష్టం దావాతో కూడా ఆయన కమల్ హాసన్ అంతుచూడటం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తమిళ బిగ్ బాస్ విషయంలో ఏర్పడిన ఈ వివాదం వల్ల పార్టిసిపెంట్స్ చేసే వివాదాలు, వ్యాఖ్యలపై తెలుగులో ఈ షోకి హోస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా షోని హోస్ట్ చేయాల్సివుందని పలువురు ముందస్తుగా ఎన్టీఆర్‌కి సూచిస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న కమలే ఇరుకున్నప్పుడు ఇక ఎన్టీఆర్ మరింత కేర్‌ఫుల్‌గా డీల్ చేయాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేస్తున్నారు.