'డిజె' చిత్రం నెగటివ్ రివ్యూస్‌తో, నెగటివ్ కామెంట్స్‌తో, పైరసీతో నానా హంగామా సృష్టించింది. ఇక తన సినిమాకు నెగటివ్ రివ్యూలు రాయడంతో హీరో అల్లుఅర్జున్, నిర్మాత దిల్‌రాజుల కంటే దర్శకుడు హరీష్‌శంకరే అందరి మీదా ఎదురుదాడి చేశాడు. పనిగట్టుకుని, కావాలని నెగటివ్ రివ్యూలు రాశారంటూ మండిపడ్డాడు. దిల్‌రాజు సినిమాలంటేనే మీడియా వారు నెగటివ్ రివ్యూలు రాయడం మామూలేనని తేల్చేశాడు.
మరి 'డిజె' విషయంలో నెగటివ్ రివ్యూలు రాసినందుకు దిల్‌రాజు సినిమా అంటేనే రివ్యూలు సరిగా రాయరని సూత్రీకరించిన హరీష్‌శంకర్ దిల్‌రాజు తదుపరి చిత్రం 'ఫిదా'కి వచ్చిన రివ్యూలను, వాటికి ఇచ్చిన మంచి రేటింగ్‌లను చూసి ఏమంటాడో తెలియదు. అడుగుదామంటే ఈ దర్శకుడి ఏకంగా అమెరికాలో తన తదుపరి చిత్రం లోకేషన్ల వేటలో ఉన్నాడు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ నగరాలలో తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన తదుపరి చిత్రం కాన్సెప్ట్ బేస్‌డ్‌గా ఉంటుందని డిజె వేడుకల్లోనే హరీష్‌శంకర్ చెప్పాడు.
ఇక ఈ చిత్రంలో హీరో, హీరోయిన్, నిర్మాత వంటి విషయాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. ఇక తన 'డిజె' చిత్రం కలెక్షన్లను చూసి మురిసిపోకుండా, నిజంగా ఈ చిత్రాన్ని చూసిన సాదారణ ప్రేక్షకుడు సినిమాలోని కంటెంట్ ఏమీ గొప్పగా లేదని పెదవి విరిచిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆయన తదుపరి చిత్రమైనా బాగుంటుందని ఆశించవచ్చు.