జీవితంలో మరెవ్వరూ దొంగలించలేని వస్తువు క్రియేటివిటీ అంటారు. కానీ వయసు పెరిగేకొద్ది పెరిగిన అనుభవంతో పాటు క్రియేటివిటీ పెరుగుతుందా? లేక వయసు పెరిగేకొద్ది ట్రెండ్‌కి, న్యూ జనరేషన్‌కి తగ్గట్లుగా మారకపోవడం వంటి వాటి వల్ల క్రియేటివిటీ తగ్గిపోతుందా? అనే దానిపై పలు వాదనలు ఉన్నాయి. కానీ దాసరి, కె.విశ్వనాథ్, కోడిరామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి నుంచి చివరకు బాపు కూడా తన చివరి కాలంలో తన మెరుపులను చూపించలేకపోయాడు.
ఇక మణిరత్నం, కృష్ణవంశీ, పి.వాసు, కె.ఎస్.రవికుమార్, సురేష్‌కృష్ణ వంటి వారిని చూసినా కూడా వారు తమ పూర్వ వైభవం కోల్పోయారని చెప్పవచ్చు. ప్రేక్షకుల తెలివితేటలు పెరగడం, యూత్ టేస్ట్ మారడం వంటివి కూడా దీనికి కారణాలు. ఇక 'శివ' చిత్రానికి దర్శకత్వశాఖలో పనిచేసి 'గులాబి, నిన్నేపెళ్లాడుతూ, సిందూరం, ఖడ్గం, అంత:పురం, సముద్రం, మురారి' వంటి హిట్స్ కొట్టి విమర్శకుల ప్రశంసలు పొందిన కృష్ణవంశీకి ఆ తర్వాత చేసిన 'చక్రం, డేంజర్, రాఖి, శశిరేఖాపరిణయం. గోవిందుడు అందరివాడేలే' చిత్రాలతో ఆ ఫామ్ కోల్పోయి గాడి తప్పాడు.
ఈమధ్యలో ఆయన 'చందమామ' మినహా ఏ చిత్రం బాగా ఆడలేదు. ఇక ఆయన పూర్తి స్క్రిప్ట్‌తో సెట్స్‌లోకి రాడనే చెడ్డపేరును తుడిచేయడానికి బైండెడ్ స్క్రిప్ట్‌తో రెడీ అయ్యాడు. అదే 'నక్షత్రం'. అయితే ఈ చిత్రం బి,సి గ్రేడ్ సినిమాలలాగా నాసిరకంగా ఉంది. ఫొటోగ్రఫీ నుంచి స్క్రీన్‌ప్లే, టేకింగ్ వరకు నాసిరకంగా ఉన్నాయి. కనీసం ఒక్క సీన్‌లో కూడా కృష్ణవంశీ మార్కు కనిపించలేదంటే ఆశ్యర్యం వేస్తుంది.
రాఖి, చక్రం, శశిరేఖా పరిణయం, మహాత్మా, గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కనీసం సినిమాలు ఆడకపోయినా కృష్ణవంశీ మార్కు కనిపించింది. కానీ 'నక్షత్రం'లో అది కూడా లేదు. ఈచిత్రం మార్నింగ్ షోకే థియేటర్ల వద్ద జనాలున్నారు. కానీ అది సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్ వంటివారి కోసం మాత్రం కాదు. కేవలం కృష్ణవంశీని నమ్మే వచ్చిన ప్రేక్షకులు వంశీకి ఏమైంది? అంటూ కనిపించడం చూస్తే తన క్రెడిబులిటీని కృష్ణవంశీ పొగొట్టుకున్నాడనే చెప్పాలి.