మంచికి, మొహమాటానికి వెళ్తే... ఎవరికో కడుపొచ్చిందనే మోటు సామెతను మన పెద్దోళ్లు ఊరకనే చెప్పలేదు. దానిలో నిజముంది..!ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆయన 'పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీం'వంటి మామూలు కంటెంట్ ఉన్న చిత్రాలు కూడా 25కోట్లు వరకు వసూలు చేయడంతో ఇక తనకు తిరుగేలేదనుకున్నాడు. అచ్చు మామ్మయ్యళ్లాగా చేస్తున్నాడని, ఆగ్రేస్, పాటలు, యాక్షన్‌సీన్లలో ఆ ఎనర్జీ చూసిన వారు వరుణ్ తేజ్ కంటే సాయి ధరమ్ తేజే మాస్ అండ్ యాక్షన్ హీరో అవుతాడని జోస్యం చెప్పారు.
దాంతో మనోడు కూడా కథను, క్యారెక్టర్‌ని పట్టించుకోకుండా ఊరమాస్‌లో నాలుగు స్టెప్పులు, నాలుగు ఫైట్స్ చేస్తే చాలని భావించి, 'తిక్క, విన్నర్' చిత్రాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇక ఆల్‌రెడీ ఏమాత్రం తన టాలెంట్‌ని చూపించలేక వివాదాలతో కాలం గడుపుతోన్న బి.వి.ఎస్.రవితో 'జవాన్' చేస్తున్నాడు. ఈచిత్రం స్టోరీ లైన్ వింటే ఇది మూసకథే అని తెలుస్తోంది. ఇక ఆయనకు కృష్ణవంశీ ఏదో ఆశించి 'నక్షత్రం' సినిమాలో ఓ గెస్ట్‌రోల్ ఇచ్చాడు. ఇక ఏకంగా కృష్ణవంశీ అడగడంతో ట్రాక్ రికార్డును, రామ్ చరణ్‌కి 'గోవిందుడు అందరివాడేలే'లో ఎదురైన పరిస్థితిని గమనించకుండా ఓకే చేశాడు.
ఇక చిరు, పవన్‌లు కూడా కృష్ణవంశీతో చేస్తే ఎన్నో నేర్చుకోవచ్చని చెప్పారు. మరి మంచి నేర్చుకున్నాడో లేదో తెలియదు గానీ ఈ చిత్రం మాత్రం సాయికి పట్టపగలే నక్షత్రాలను చూపించింది. ఆయన పాత్ర అర్ధం పర్ధం లేకుండా సాగింది. ఇంత పేలవమైన పాత్రను సాయి ఎందుకు చేశాడా? అనే అనుమానం కూడా అందరికీ కలుగుతోంది. ఇక సందీప్ కిషన్ వంటి వారిని నమ్ముకోకుండా కృష్ణవంశీ భలే ఐడియా వేసి తేజూ క్యారెక్టర్‌ని షూటింగ్‌లో పెంచుతూ పోయాడు.
వారం షూటింగ్ అనుకున్న పాత్ర కాస్తా నెలసాగింది. ఇక సినిమా కష్టాలు చూసి ఆయన పారితోషికం కూడా వద్దు.. పేరొస్తే అదే చాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఫ్లాప్ ఖాతా కృష్ణవంశీ, సందీప్ కిషన్‌లకి తోడు సాయి అకౌంట్‌లో కూడా బలంగానే పడింది. హ్యాట్రిక్ ఫ్లాప్ హీరో అనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.