నిజానికి నిర్మాణ వ్యయం పెరిగిపోతోందని గగ్గోలు పెట్టేవారే అలా బడ్జెట్ ఓవర్‌గా పెరిగి, గుదిబండగా మారడానికి మూల కారకులు అనే సంగతి గమనించవచ్చు. కాల్షీట్స్ కోసం, ఐటం సాంగ్‌ల కోసం, నాలుగైదు సీన్లలో నటించే వారికి కూడా కోట్లలో పారితోషికాలు ఇచ్చి నటీనటులను చెడగొడుతున్నది దర్శకనిర్మాతలే. ఒక్క చిత్రంకు దర్శకనిర్మాతలు అంత పారితోషికం ఇస్తుండటంతో ఆయా నటీనటులు తమ డిమాండ్ అంత ఉంది కాబోలు అని అదే పారితోషికాన్ని అందరి నుంచి వసూలు చేస్తున్నారు.
ఇలా బడ్జెట్ చెప్పడానికి 100కోట్లు చెప్పినా, అందులో పారితోషికాలు, ఫైనాన్స్ వడ్డీలకే 75శాతం బడ్జెట్ ఖర్చయిపోతోంది మిగిలిన 25 శాతంలో ప్రొడక్షన్ మిగిలినవి పోను సినిమా కోసం కేటాయించే బడ్జెట్‌లో సినిమా లోకేషన్లు, ఇతర షూటింగ్‌లకు 10శాతం కూడా ఖర్చుపెట్టడం లేదు. దీనికి దర్శకనిర్మాతలే బాధ్యులు.
ఇక తన కొడుకుని ఎలాగైనా మాస్ అండ్ యాక్షన్ హీరోగా చేయాలని భావించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేసిస మొదటి చిత్రానికే వినాయక్‌కి బంపర్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి డబ్బుని నీళ్లలా ఖర్చుపెట్టి, సమంత, తమన్నా వంటి వారికి అడిగినంత ఇచ్చాడు. ఈ బడ్జెట్టే ఆ చిత్రానికి శాపంగా మారింది. అలా 'అల్లుడు శీను' ఫర్వాలేదనిపించినా, వచ్చింది మాత్రం నష్టాలే.
ఇక తాజాగా బోయపాటి శ్రీనుకి కూడా కళ్లు చెదిరే రెమ్యూనరేషన్, దేవిశ్రీప్రసాద్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రగ్యాజైస్వాల్, కేథరిన్ ఇలా అందరికీ ఎవ్వరూ ఊహించని, తమను తాము నమ్మలేని రెమ్యూనరేషన్ ఇచ్చాడు. ఇక శరత్‌కుమార్ నుంచి జగపతిబాబు వరకు సినిమా ఎక్కడా తగ్గకూడదని డబ్బులు వెదజల్లాడు. ఇక ఇందులో కేవలం నాలుగైదుసీన్లు ఉన్న పాత్ర కోసం నిన్నటి తరం హీరోయిన్ వాణి విశ్వనాథ్‌ని తీసుకుని మూడు రోజుల షూటింగ్‌కి ఏకంగా 40లక్షల వరకు పారితోషికం ఇచ్చాడట.
సరే అది ఆయన డబ్బు.. ఆయన ఇష్టం అనుకోవడానికి వీలులేదు. రాబోయే ఇతర చిత్రాల నిర్మాత, దర్శకులను కూడా ఆయా నటీనటులు అంతకంటే ఎక్కువ డిమాండ్ చేసేలా చేసి, పరిశ్రమలో విష సంస్కృతి నాటడం మాత్రం సమంజసం కాదనే చెప్పాలి...! చిన్న చిత్రాలతోనే స్టార్స్ అనిపించుకుంటూ దూసుకుపోతున్న నిన్నటి రవితేజ, నేటి నాని, శర్వానంద్, రాజ్‌తరుణ్, నిఖిల్, విజయ్ దేవరకొండలలాగా కంటెంట్‌ని నమ్ముకుంటే నూతనత్వం కలిగిన కొత్త దర్శకులు కూడా అద్భుతాలు చేయగలరనే విషయాన్ని బెల్లంకొండ సురేష్ ఎప్పుడు అర్ధం చేసుకుంటాడో వేచిచూడాల్సివుంది..!