బాలకృష్ణ ఎనర్జీకి అందరూ ముగ్దులైపోతున్నారు. కుర్ర హీరోలకు కూడా లేని ఎనర్జీ ఇంత వయసొచ్చిన బాలయ్యలో కనబడుతుంటే హీరోయిన్స్ మాత్రమే ఆశ్చర్యపోవడంలేదు. నందమూరి అభిమానులు సైతం బాలయ్య ఎనర్జీకి పడిపోతున్నారు. ఆ ఎనర్జీతోనే పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన 'పైసా వసూల్' ని రికార్డు టైం లో పూర్తి చేసి అవతలపడేశాడు. ఇక పూరి కూడా తక్కువేమి కాదు. పూరి కూడా అనుకున్నటైం కన్నా ముందే సినిమాలను తయారు చేయగల సత్తా వున్న డైరెక్టర్. ఇక బాలయ్య - పూరి కాంబోలో వస్తున్న 'పైసా వసూల్' చిత్రం సెప్టెంబర్ 1 న విడుదల కాబోతుంది.
ఇక విడుదలకు సమయం ఆసన్నమవుతున్నకొద్దీ సినిమా పబ్లిసిటీ స్టంట్ ని కూడా పెంచేసింది చిత్ర యూనిట్. ఈ నెల 17 న ఖమ్మంలో పైసా వసూల్ ఆడియో వేడుకని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో బాలకృష్ణ తన అభిమానులకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని ప్రచారం షురూ అయ్యింది. 'పైసా వసూల్' ఆడియో స్టేజ్ పై బాలయ్య పాట పాడే అవకాశం ఉందంటున్నారు. మామూలుగానే బాలకృష్ణ బయట స్టేజ్ ల మీద తన ఉపన్యాసాలతో, పాటలతో, పద్యాలతో హోరెత్తించేస్తుంటాడు. అలాంటివి చెయ్యడానికి బాలకృష్ణ కి ఎక్కడలేని ఊపు వచ్చేస్తుంది.
ఇక 'పైసా వసూల్' లో బాలకృష్ణ తన గొంతు సవరించి ఓ పాటను స్వయంగా పాడిన సంగతి తెలిసిందే. ఏక్ పెగ్ లావో అనే పల్లవితో పాట స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు ఇదే పాటనే 'పైసా వసూల్' ఆడియో స్టేజ్ మీద లైవ్ ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారట బాలయ్య. మరి బాలకృష్ణ కేవలం మాట్లాడితేనే పిచ్చెక్కిపోయి పండగ చేసుకునే ఫాన్స్, ఆ మధ్య బాలయ్య టాప్ సింగర్స్ తో కలిసి స్వయంగా పాడుతుంటే..తన్మయంతో ఊగిపోయారు. ఇప్పుడు బాలయ్యకి మరోసారి మూడ్ వచ్చింది. మరోసారి తన గొంతు లైవ్ లో సవరించి తన ప్రత్యేకత ని చాటుకోవడానికి బాలయ్య రెడీ అవుతున్నాడు. మరి బాలయ్య ఫ్యాన్స్ ఇంకెందుకు ఆలస్యం..ఖమ్మంకి టికెట్స్ రిజర్వ్ చేసుకోండి.