నేడున్న యంగ్ హీరోలలో శర్వానంద్ 'ధైర్యే సాహసి లక్ష్మి' అనే మంత్రాన్ని నమ్ముతున్నాడు. 'రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి' చిత్రాలను కూడా భారీ పోటీలో నిలిపి విజయం సాధించాడు. కానీ ఆయన గత చిత్రం 'రాధ' చిత్రం సరిగా ఆడలేదు. అయినా తన తదుపరి చిత్రమైన 'మహానుబాహుడు'ని ఆయన పోటీలోనే దించడానికి రెడీ అవుతున్నాడు.
వాస్తవానికి దసరా కానుకగా మొదట సెప్టెంబర్ 29న బాలకృష్ణ- పూరీ జగన్నాథ్‌ల 'పైసా వసూల్' రిలీజ్ చేయాలని భావించారు. ఈ విషయం సినిమా ప్రారంభోత్సవం రోజే తెలిపారు. కానీ ఎన్టీఆర్ 'జై లవకుశ' సెప్టెంబర్ 21న, మహేష్‌బాబు 'స్పైడర్' సెప్టెంబర్ 27న రానుండటంతో బాలయ్య- జగన్‌ల 'పైసా వసూల్' చిత్రం సెప్టెంబర్1కి వచ్చింది. ఇక అదే తేదీన అంటే 'పైసా వసూల్'మొదటి రిలీజ్ డేట్‌గా భావించిన సెప్టెంబర్ 29న చిన్నగా శర్వానంద్ తన 'మహానుబాహుడు'తో వస్తున్నాడు. ఈచిత్రానికి మారుతి దర్శకుడు. మారుతి మీద నమ్మకంతోనే ఈ చిత్రాన్ని ఈ పోటీలో దింపుతున్నామని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేషన్స్ అధినేతలు ప్రమోద్, వంశీలు చెబుతున్నారు.
ఇక ఈ చిత్రానికి థియేటర్ల సమస్య వచ్చే అవకాశమే లేదు. కారణం యువి క్రియేషన్స్ అధినేతలు స్వయంగా డిస్ట్రిబ్యూటర్లు కావడమే కాదు.. వారికి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పలు థియేటర్లు ఉన్నాయి. ఇక ఇందులో ప్రభాస్ కూడా వన్ ఆఫ్‌ది పార్ట్‌నర్‌గా చెబుతారు. మరి ఈ రెండు భారీ చిత్రాల నడుమ సైలెంట్ కిల్లర్‌గా వస్తోన్న 'మహానుబాహుడు' చిత్రం ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తాడో వేచి చూడాల్సివుంది...!