బాలకృష్ణ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులున్నారు. బాలకృష్ణ ఒక పక్క సినిమాలను మరో పక్క రాజకీయాలను బాగానే హ్యాండిల్ చేస్తూ బిజీ బిజీ గా వున్నాడు. బాలయ్య నటించిన 'పైసా వసూల్' సెప్టెంబర్ 1 న విడుదలకు సిద్ధమవుతుండగా... రవికుమార్ డైరెక్షన్ లో మరో మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లిపోయాడు బాలయ్య. అలాగే హిందూపురం ఎమ్యెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్న బాలకృష్ణ ఇప్పుడు నంద్యాల బై ఎలెక్షన్స్ లో టిడిపి తరుపున ప్రచారంలో పాల్గొంటూ..... భూమా కుటుంబం తరుపున ప్రచారం చేస్తున్నాడు.
అయితే బాలకృష్ణ నంద్యాల టూర్ కి నందమూరి అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. అక్కడ ఆయన ఫాన్స్ సృష్టించే హంగామా అంతా ఇంతా కాదు. అయితే బాలకృష్ణ కి నంద్యాలలో రాత్రి పూట ఉండడం కోసం ఒక లాడ్జిలో బస ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి చేరుకుంటున్న టైం లో బాలకృష్ణ కి ఫాన్స్ లో ఒకరు పూల దండ వెయ్యడానికి ప్రయత్నించి బాలకృష్ణ మీద పడగా వెంటనే బాలయ్య బాబు ఆ ఫ్యాన్ చెంప చెళ్లుమనిపించడమే కాకుండా బాలయ్య సెక్యూరిటీ కూడా ఆ అభిమానిని కొట్టడం ఇప్పుడు మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. మామూలుగానే బాలకృష్ణ కి కోపం తెప్పించే పనులేమైనా చేస్తే వెంటనే బాలయ్యకి పట్టరాని కోపం వచ్చేసి అక్కడున్నది ఎవరు అని చూడకుండానే వారి మీద చెయ్యి చేసుకోవడం బాలయ్యకి బాగా అలవాటే.
మొన్నటికి మొన్న తన సినిమా ఓపెనింగ్ రోజున తన అసిస్టెంట్ ని కూడా కొట్టిన బాలయ్య ఇలా కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా సంయమనం కోల్పోతూ ఇలా కెమెరా కళ్ళకు చిక్కి పోతున్నాడని నందమూరి ఫాన్స్ వర్రీ అవుతున్నారు. అయితే ఓపక్క నంద్యాల ఉప ఎన్నికల వేళ.. పోటాపోటీగా ప్రచారం సాగుతున్న వేళ.. ఇలా బాలకృష్ణ ఆగ్రహంతో అభిమానిపై చేయి చేసుకున్న తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఈ సంఘటన టీడీపీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇకపోతే బాలకృష్ణ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పైసా వసూల్' ఆడియో లాంచ్ గురువారం సాయంత్రం ఖమ్మంలో నందమూరి అభిమానుల మధ్యన అంగరంగ వైభవంగా జరగబోతున్న సంగతి తెలిసిందే.