బిగ్ బాస్ షోని శని ఆదివారాల్లో ఎన్టీఆర్ హోస్ట్ గా ఎంత ఎంటర్టైన్ చేసినప్పటికీ మిగతా ఐదు రోజులు మాత్రం డల్ అవుతూనే వుంది. వారానికొకరిని ఎలిమినేట్ చేస్తూ మరొకరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా షోలకి తీసుకొచ్చినా పరిస్థితిలో ఎటువంటి మార్పులేకుండా పోయింది. ఆ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా షోలో ఎంట్రీ ఇచ్చిన దీక్ష పంత్ కూడా షోలో ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేక డల్ అయ్యింది. బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్స్ అంతా నేచురల్ గా కాకుండా కేవలం నటనతోనే ఈ షోని నెట్టుకొస్తున్నారనే టాక్ కూడా ఉంది. అలాగే అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని అందరికి అర్ధమైంది.
ఇలాంటి టైం లో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గత ఆదివారం బిగ్ బాస్ హౌస్ లోకి నటుడు నవదీప్ ఎంట్రీ ఆసక్తిని కలిగిస్తుంది. నవదీప్ బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయిన దగ్గర నుండి షో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నవదీప్ వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే షో కి కొత్త యాక్టీవ్ మోడ్ వచ్చేసింది. పాత పార్టిసిపేట్స్ మాదిరిగా కాకుండా నవదీప్ తాను బయట ఎలా ఉంటాడో అలానే ఈ షోలో కనిపిసున్నాడు. అందరిలా సేఫ్ గేమ్ ఆడకుండా తనకి ఏది తోస్తే అది మాట్లాడేస్తూ ఈ షోలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించేశాడు. బిగ్‌బాస్ ఆట ఆడడానికి వుండాల్సిన కన్నింగ్ లక్షణాలకి తోడు సమయస్ఫూర్తి, హాస్య చతురత కూడా నవదీప్‌లో అన్ని ఎక్కువే కనబడుతున్నాయి.
ఇక నవదీప్ వచ్చినప్పటినుండి ఈ షోకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇక ఈ షో లో ఇప్పటివరకు ఆదర్శ్, ప్రిన్స్, కార్తీక వంటి వాళ్ళు కామ్ గా మంచిగా కనబడుతూ ప్రేక్షకుల నుండి మంచి మార్కులు కొట్టెయ్యడానికి చాలానే ప్లాన్స్ వేస్తున్నారు. ఇక ఇప్పుడు నవదీప్ ని చూసి వారు తమ మైండ్ ని తప్పక మార్చుకుంటారనే అభిప్రాయాలూ ప్రేక్షకుల నుండి వ్యక్తమవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ తోపాటు నవదీప్ కూడా ఈ షోకి హైప్ తీసుకురావడానికి బాగానే కష్టపడుతున్నాడనడంలో సందేహం లేదనే చెప్పాలి.