నటునిగా రానా దగ్గుబాటి ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఆయన నటించిన చిత్రాలు ఆడలేదే గానీ దేశవ్యాప్తంగా వెరైటీ అవకాశాలను చేజిక్కించుని, వైవిధ్య చిత్రాలనే ఆయన చేస్తున్నాడు. ఇక ఆయన 'బాహుబలి' తర్వాత భళ్లాలదేవగా మాత్రం ఇండియాలోనే కాదు... విదేశాలలో కూడా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఆ క్రేజ్‌ని సద్వినియోగం చేసుకుంటే ఇక ఆయనకు తిరుగుండదు. 'బాహుబలి' సమయంలో ప్రభాస్ కంటే కోలీవుడ్ బాలీవుడ్‌లలో సైతం రానాకే ఎక్కువ క్రేజ్ ఉండేది. ఇప్పుడు అది ఎన్నోరెట్లు పెరిగింది. దాంతో ఆయన కూడా 'ఘాజీ', 'నేనేరాజు నేనే మంత్రి' చిత్రాలతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రానా చిత్రం అంటే విభిన్న చిత్రం అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించడంలో సక్సెస్ అయ్యాడు.
రొటీన్ పాత్రలతో రొట్ట కొట్టుడు కొట్టకుండా ఆయన చేస్తున్న చిత్రాలు భవిష్యత్తులో మరింత వినూత్నంగా ఉంటాయి అని రానా దగ్గుబాటి నమ్మకంగా చెబుతున్నాడు. మరోవైపు కోట్లు ఖర్చుపెట్టి, ఏకంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న 'బిగ్‌బాస్' షో విషయంలో తక్కువ ప్రజాదరణ, తక్కువ బడ్జెట్ వంటి అవరోధాలను కూడా ఆయన దాటి తన 'నెంబర్‌వన్ యారీ'ని బాగా చేస్తున్నాడు. ఈ షోని 'విఐయు' సంస్థ రూపొందిస్తోంది. తాజాగా ఈ భళ్లాలదేవ నుంచి జోగేంద్రగా మారిన రాణా త్వరలో ఈ సంస్థ రూపొందించే ఓ వెబ్‌సీరిస్‌లో కూడా నటించడానికి ఓకే చెప్పాడట.
సినిమాలు, టీవీ అనే తేడా లేకుండా నేటియువత ఇంటర్నెట్‌కి వస్తున్న ప్రాధాన్యతను గుర్తించి ఆయన నామోషీగా ఫీలవ్వకుండా దీనిని ఓకే చేయడం డేరింగ్ నిర్ణయమే. ఇందులో రానా ఓ కీలకపాత్రలో నటించనుండగా, నవీన్ కస్తూరియా మరో పాత్రలో నటించనున్నాడు. ఈ వెబ్‌సీరిస్ పేరు 'సోషల్'. నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న పలు సమస్యలపైనే ఈ వెబ్‌సీరిస్ రానుందని సమాచారం. కిడ్నాప్‌కి గురైన తన సోదరిని వెత్తుకునే పాత్రలో నవీన్ స్తూరియా నటించనున్నాడు. కాగా ఈ వెబ్‌సీరిస్ సెప్టెంబర్ నుంచి మొదలు కానుందని సమాచారం.