ఎప్పుడెప్పుడు చిరంజీవి 151 వ సినిమా టైటిల్ వింటామా, మోషన్ పోస్టర్ చూస్తామా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి, రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు మెగా ఫ్యామిలీ మెగాస్టార్ చిరు 151 చిత్ర టైటిల్ లోగో మరియు మోషన్ పోస్టర్ ని కానుకగా ఇచ్చేసింది. మెగాస్టార్ చిరు 151 వ సినిమా టైటిల్ 'సైరా, అని సెలెక్ట్ చేసి దానికి ట్యాగ్ లైన్ గా నరసింహారెడ్డి' అంటూ పెట్టారు. మరి ఈ టైటిల్ ని ఇలా పెడతారని ఎవ్వరూ ఊహించలేదు కూడా. ఇప్పటివరకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మహావీర అనే టైటిల్స్ మాత్రమే నానుడిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ సస్పెన్సు కి తెరదించుతూ 'సైరా' అనే టైటిల్ పెట్టేశారు.
ఇక ఇదే టైటిల్ తో నాలుగు భాషల్లో ఈ సినిమాని విడుదల చెయ్యడానికి రామ్ చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డిలు ప్లాన్ చేశారు. అందుకే ఈ సినిమా కోసం జగపతిబాబు తో పాటు బాలీవుడ్ నుండి అమితాబచ్చన్ ని, కన్నడ నుండి సుదీప్ ని, తమిళ్ నుండి విజయ్ సేతుపతి... ఇక హీరోయిన్ గా తెలుగు, తమిళం కు పరిచయమున్న నయనతారని సెలెక్ట్ చేసి మరి ఒక మోషన్ పోస్టర్ రూపంలో వారి పేర్లను రివీల్ చేశారు. అలాగే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న ఏ ఆర్ రెహ్మాన్ ని ఈ చిత్రం కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా దించారు.
ఇక ఈ 151 సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ డిజైన్స్ లుక్స్ అన్ని అదిరిపోయాయనే చెప్పాలి. 'సైరా' టైటిల్ పోస్టర్ లో ఉన్న వ్యక్తి వెనక్కి తిరిగి ఒక చేత్తో బాణం, మరో చేత్తో కత్తి పట్టుకుని విప్లవ వీరుణ్ణి తలపించే రీతిలో నిల్చుని ఉండే లుక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ కత్తి, బాణం అన్ని చూస్తుంటే ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధమవుతుంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటీష్ వారిని ఎలా గడగడలాడించాడో అనేది ఈ మోషన్ పోస్టర్ స్టార్టింగ్ లో విదేశీ జెండా తగలపెట్టడంలోనే అర్ధమవుతుంది. ఇక ఈ పోస్టర్ లుక్ లో అంతా ఎరుపుదనాన్నే హైలెట్ చెయ్యడం చూస్తుంటే ఈ సినిమా మొత్తం యాక్షన్ చుట్టూతానే తిరుగుతుందనేది మాత్రం అర్ధమవుతుంది.
మరి భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని 'బాహుబలి' రేంజ్ లో తెరకెక్కించి నాలుగు భాషల్లో మంచి హైప్ తీసుకొచ్చి హిట్ కొట్టాలనే కసితో నిర్మాత రామ్ చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డిలు ఉన్నారు.