చిరంజీవి 151 వ చిత్రం 'సై రా.. నరసింహారెడ్డి' ఆఫీషియల్ గా ఓపెనింగ్ అయ్యింది. అలాగే 'సై రా' మోషన్ పోస్టర్ కూడా అభిమానులని అంగరంగ వైభవంగా అలరించేసింది. 'సై రా నరసింహారెడ్డి' లుక్ అందరిని విపరీతంగా ఆకర్షించేస్తుంది. 'సై' కి 'రా' కి మధ్యన ఉన్న కత్తి చూస్తుంటే అది అచ్చం అప్పట్లో ఉయ్యాలవాడ వాడిన కత్తిలా కనిపిస్తుందని అంటున్నారు. ఇకపోతే 'సై రా నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ లో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో పనిచేసే నటీనటుల పేర్లని రివీల్ చేసింది చిత్ర యూనిట్. చిరంజీవి టైటిల్ రోల్, జగపతిబాబు, బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబచ్చన్, కన్నడ నటుడు సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, అలాగే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార, మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్, నిర్మాత రామ్ చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రవివర్మ సినిమాటోగ్రాఫర్, రచన పరుచూరి బ్రదర్స్ అంటూ 'సై రా' కి పనిచేసే నటీనటులు, టెక్నీషియన్స్ ని పరిచయం చేశారు.
అయితే ఇక్కడ ఒకటే తేడా కొడుతోంది అనే టాక్ వినబడుతుంది. అదేమిటంటే చిరు 'సై రా' కి మ్యూజిక్ డైరెక్టర్ కింద ఎస్ ఎస్ థమన్ పనిచేస్తాడనే టాక్ గత రెండు రోజులుగా వినబడుతుంది. ఇప్పుడు ఈ మోషన్ పోస్టర్ ని చూసే వరకు ఈ సినిమాలో ఏ ఆర్ రెహ్మాన్ పనిచేస్తున్నాడని కన్ఫర్మ్ కాలేదు. అందుకే రెండు మూడు రోజులుగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఫెవరెట్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నాడని ప్రచారం మొదలైంది. అలాగే ఏ ఆర్ రెహ్మాన్ తో కూడా సురేందర్ రెడ్డి చర్చలు జరిపాడు అని చెప్పినప్పటికీ అది చివరి నిమిషం వరకు ఫైనల్ కాలేదు. ఇకపోతే ఏ ఆర్ రెహ్మాన్ అందుబాటులో లేని కారణంగా ఈ 'సైరా' మోషన్ పోస్టర్ ఎస్ ఎస్ థమన్ నే రీరికార్డింగ్ చేసినట్లు గా ప్రచారం మొదలైంది.
ఇక చిత్ర యూనిట్ కూడా అందరి నటీనటుల, టెక్నీషియన్స్ పేర్లను పంపి మోషన్ పోస్టర్ తయారు చెయ్యమన్నారట గాని మ్యూజిక్ డైరెక్టర్ పేరును థమన్ కి పంపలేదట. దీంతో ఈ మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇస్తే... సినిమాకి మ్యూజిక్ అందించే అవకాశం తనకే వస్తుందనే ఆశతో ఈ మోషన్ పోస్టర్ ని గత రెండు మూడు రోజులుగా అన్ని పనులు పక్కన పెట్టేసి మరీ రెడీ చేసిచ్చాడట. కానీ ఫైనల్గా 'సై రా' కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహ్మాన్ పేరు పడింది. మరి ఏ ఆర్ ఎహ్మన్ అయితే అన్ని భాషలకు పరిచయం ఉన్న పేరు కాబట్టే చిత్ర టీమ్ అంతా రెహ్మాన్ వైపే మొగ్గు చూపారట.
అలా చిరంజీవి 151 వ చిత్రం 'సై రా' మోషన్ పోస్టర్ ని తాటతీసే లెవల్లో తయారు చేసి, మ్యూజిక్ చేసే అవకాశం వస్తుందని ఎంతో ఆశగా చూసిన థమన్ కి చివరికి భంగపాటు ఎదురైందని అంటున్నారు. అలాగే థమన్ ఆశ నిరాశే అయ్యిందిగా అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.