భారతదేశ విదేశాంగ విధానంలోని మొదటి పాయింట్ వేరే దేశాల ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోకపోవడం అనేది ముఖ్యమైంది. కానీ బంగ్లాదేశ్ స్వాతంత్యం కోరుకుంటున్న సమయంలో మన దేశం బంగ్లాదేశ్ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వడమేకాదు... వారి తరపున సైన్యాన్ని పని చేయించేలా చేసింది. అక్కడి నుంచే పాకిస్థాన్.. ఇండియా అంటే భగ్గుమంటోంది. కేవలం మద్దతు తెలిపినా ఫర్వాలేదు కానీ పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాలలో మనం చేయి పెట్టకూడడు. ఇక శ్రీలంకలో ప్రత్యేక ఈలం కోసం తమిళులు చేస్తున్న సాతంత్య్ర పోరాటానికి కేవలం మద్దతు తెలపడమో, లేక ఖండించడమో చేసి ఉంటే సరిపోయేది. కానీ తమిళులపై ఊచకోత కోసి ఎల్టీటీఈని తుదముట్టించడంతో మన దేశం అనవసరంగా ఆదేశానికి సైన్యాన్ని పంపి పెద్ద తప్పు చేసింది. అదే చివరికి ఎల్టీటీఈ కోపానికి చివరకు రాజీవ్‌గాంధీ హత్యకు ఎల్టీటీఈ పూనుకోవడం జరిగింది.
ఇక ఇప్పుడు ఈ గత చరిత్రను మరలా తెరపైకి తెస్తూ మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అజయ్ అండ్రూ పనిచేస్తున్నాడు. ఇక తాను చిన్నప్పటి నుంచి మద్రాస్‌లో పెరిగి పెద్దయ్యానని, తనకు తమిళులు లంకలో పడిన బాధలు తెలుసంటున్నాడు మంచు మనోజ్. ఈ చిత్రం తన కెరీర్‌లో భారీ చిత్రమే కాదు... అద్భుతమైన చిత్రమనీ చెబుతున్నాడు. సాధారణంగా ప్రతి సినిమాకి నటీనటులు, టెక్నీషియన్స్ ప్రాణం పెట్టి పనిచేశామని చెబుతూ ఉంటారు. కానీ మనోజ్ మరో అడుగు ముందుకేసి 'ఒక్కడు మిగిలాడు' చిత్రం షూటింగ్‌లో మరణించినా ఫర్వాలేదని భావించానని, మామూలు చిత్రం చేసేటప్పుడు చనిపోయినా ఎవ్వరూ పట్టించుకోరని, కానీ 'ఒక్కడు మిగిలాడు' వంటి గొప్ప చిత్రం షూటింగ్‌లో చనిపోతే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని అంటున్నాడు.
ఎల్టీటీఈ సమస్య ప్రపంచం మొత్తం తెలిసిన సమస్య కాబట్టి ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో కూడా ప్రదర్శించాలని భావిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ బాషల్లో కూడా విడుదల చేస్తామంటున్నాడు. మొత్తానికి సెప్టెంబర్ 8న ఇద్దరు తమిళులు దర్శకత్వం వహిస్తున్న రెండు తెలుగు చిత్రాలు 'యుద్దం శరణం, ఒక్కడు మిగిలాడు' చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి.