మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సై...రా.. నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ విడుదల అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు రామ్‌చరణ్, అల్లుఅరవింద్, రాజమౌళి వంటి వారు హాజరయ్యారు. కానీ ఈ వేడుకకు చిరంజీవి మాత్రం రాలేదు. ఓ వీడియాలో తన సందేశం ఇచ్చాడు. అయినా ఈ వేడుకకు చిరంజీవి రాకపోవడంతో మెగాభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. చిరంజీవి విదేశాలలో ఏమీ లేడు. హైదరాబాద్‌లోనే ఉన్నా కూడా హాజరుకాలేదు. తన ఇంటిలోనే జన్మదిన శుభాకాంక్షలు అందుకున్నాడు. దీనిపై పలు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
ప్రస్తుతం మెగాస్టార్ 'సై..రా.. నరసింహారెడ్డి' పాత్రకు తగ్గ లుక్ విషయంలో బిజీగా ఉన్నాడు. సో.. ఈ వేడుకకు హాజరైతే ఆయన లుక్ రివీల్ అవుతుందనే ఎంతో జాగ్రత్తతో ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్, ఏ.ఆర్. రెహ్మాన్ వంటి వారు పనిచేస్తున్నారు. ఈ చిత్రం సందర్భంగా వీరు కనీసం ఓ ట్వీట్ చేయడం గానీ, లేదా రీట్వీట్ కూడా చేయకుండా మౌనంగా ఉండటంతో చివరి క్షణాల్లో వీరేమైనా ఈ చిత్రానికి హ్యాండ్ ఇస్తారా? అని మెగాభిమానులు భయపడుతున్నారు. అయినా ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రం ఫంక్షన్ మాత్రం అనుకున్నంత వేడుకగా, ఘనంగా జరగలేదనే చెప్పాలి. ఇప్పటినుంచే హైప్ క్రియేట్ కాకుండా చూసేందుకు ఈ చిత్రం యూనిట్ ఈ విధంగా ప్లాన్ చేసి ఉంటుందని అంటున్నారు.