కొరియోగ్రాఫర్, ఆ తర్వాత నటునిగా, ఇప్పుడు హీరోగా, మరోవైపు దర్శకునిగా రాఘవలారెన్స్ తన సత్తా చాటుతున్నాడు. ఇక ఆయన హర్రర్ కామెడీ చిత్రాలతో ట్రెండ్ సెట్ చేసి, అదే బాటలో ఎన్నో చిత్రాలు రావడానికి మూల కారణంగా మారాడు. హర్రర్ చిత్రాలతో నటునిగా, దర్శకునిగా తన సత్తా చాటుతున్నాడు. ఇక ఆయన డైరెక్షన్ చేసి నటించిన 'ముని, కాంచన, గంగ' చిత్రాలు తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా ఈ చిత్రాలను తీసిన వారికి కనకవర్షం కురిపించాయి.
ఇక తాజాగా ఆయన తెలుగులో హిట్టయిన 'పటాస్'కి రీమేక్‌గా 'మొట్ట శివ- కెట్ట శివ' చిత్రం చేశాడు. ఇది బాగా ఆడలేదు. ఇక సీనియర్ దర్శకుడు అయిన పి.వాసు దర్శకత్వంలో కన్నడలో సూపర్‌హిట్ అయిన 'శివలింగ' చిత్రం చేశాడు. రెండు చిత్రాలు సరిగా ఆడలేదు. దాంతో 'ముని' సీరీస్‌లో భాగంగా మరో చిత్రానికి ఆయన శ్రీకారం చుడుతున్నాడు. ఇంతకు ముందు 'ముని' సిరీస్‌లో ఆయన చేసిన చిత్రాలలో ఆయనే నటించి, దర్శకత్వం చేశాడే గానీ, నిర్మాతలుగా వేరే వారే వ్యవహరించారు.
కానీ తాజా చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తూ, తనే నటిస్తూ, తానే ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా తాను తీసే ముని సిరీస్‌కి మంచి డిమాండ్ ఉండటంతో ఇందులో రెండు భాషల్లోనూ పరిచయం ఉన్న నటీనటులను తీసుకుంటున్నాడు. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ని దాదాపు కన్‌ఫర్మ్ చేశాడని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అప్పుడే శాటిలైట్ బిజినెస్ కూడా జరిగిపోయిందని తెలుస్తుంది. మరి ఈ చిత్రం కోలీవుడ్, టాలీవుడ్‌లలో ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది? నిర్మాతగా రాఘవలారెన్స్‌కి ఎంతగా కనకవర్షం కురిపిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.