ఆగష్టు 11 న బరిలోకి దిగిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాన్ని డైరెక్టర్ తేజ చాలా తక్కువ బడ్జెట్ లోనే పూర్తి చేసి శెభాష్ అనిపించాడు. ఆ సినిమా విడుదలై నిర్మాతలకు లాభాల పంట పండించిందనే టాక్ వుంది. అలాగే డైరెక్టర్ తేజకి చాలా రోజుల తర్వాత ఒక హిట్ చేతికి రావడం కూడా జరిగింది. ఇక రానా సోలో హీరోగా హిట్ కొట్టాడు. ఈ చిత్రం విడుదలైన ప్రతి చోటా మంచి టాక్ తో మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ చిత్రంతో తేజ మళ్ళీ ఫామ్ లోకి రావడం కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషమే.
అయితే తేజ కి మంచి పేరు అలాగే ఫామ్ లోకి రావడం, ఇంకా తేజ డైరెక్షన్ లో నటించడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం ఒక ఎత్తైతే ఇప్పుడు తేజకి 'నేనే రాజు నేనే మంత్రి' తో మంచి లాభాల పంట కూడా పండిందట. తేజ ఈ చిత్రానికి రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా లాభాల్లో నుండి 25 పైసల వాటా తీసుకుంటున్నాడనే టాక్ ముందు నుండి వుంది. ఇక సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లోనే అంటే 11 నుండి 12 కోట్ల మధ్యలోనే పూర్తి చేశారు కాబట్టి సినిమాకి అయిన బడ్జెట్ పోను వీరంతా బాగానే వెనకేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.
అయితే వచ్చిన లాభాల్లో తేజకి దాదాపు ఐదు కోట్లమేర వెళుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. పైన వచ్చిన లెక్క ప్రకారం... ఒక్క తేజాకి మాత్రమే ఆ ఐదు కోట్లు వెళ్లడం లేదట. ఆ చిత్ర నిర్మాతలు కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, దగ్గుబాటి సురేష్ బాబులకు అలాగే హీరో రానా కు కూడా తలా అయిదు కోట్లు వస్తాయని తెలుస్తోంది. అంటే ఓవరాల్ గా దర్శకనిర్మాతలు, హీరోలకు తలా ఐదు కోట్లు వెళుతున్నాయన్నమాట. మరి ఈ ఎమౌంట్ చూస్తుంటే తేజా మంచి జాక్ పాట్ కొట్టినట్టే కనబడుతుంది. ఈ లెక్కన తేజ ఈ ఐదు కోట్ల ఫిగర్ చూసి బాగానే సంతోషపడి ఉంటాడు.