నరేంద్రమోదీ ప్రధాని అయితే విప్లవాత్మక మార్పులు వస్తాయని, ఆయన వల్ల పేద, మద్యతరగతి వారికి సౌలభ్యాలు లభిస్తాయని, అవినీతి, అక్రమార్కులైన బడా బాబుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాడని పలువురు బావించారు. కానీ ఆయన కూడా కాంగ్రెస్, మన్మోహన్ సింగ్‌లలానే పారిశ్రామిక రంగాలకు, బడా వ్యాపార వేత్తల కళ్ల సైగలపై ఆధారపడి పాలన సాగిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఇక కేవలం ఒకటిన్నర ఏడాదే పదవి కాలం ఉండటంతో ఇకపై సంస్కరణలను పక్కనపెట్టి మోదీ కూడా ప్రజాకర్షణ పథకాలను శ్రీకారం చుట్టనున్నారని అర్ధమవుతోంది. ఇక ఆయన తీసుకున్న అతి సాహసోపేతమైన నిర్ణయాలలో పెద్ద నోట్ల రద్దు ముఖ్యమైంది.
దీనివల్ల ఒక్క ధనవంతుడు, ఒక్క కార్పొరేటర్ స్థాయి నాయకుడు కూడా ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ సామాన్యులు, మద్యతరగతి ప్రజలే దాని వల్ల బాధపడ్డారు. మరోవైపు జిఎస్టీతో పాటు ప్రతి వ్యక్తిని పన్ను పరిధిలోకి తెచ్చే చర్య పారిశ్రామిక వ్యవస్థలకు అనుకూలంగా, వారికి నొప్పి కలిగించకుండానే, పేద, మధ్యతరగతి నడ్డి విరగొట్టేలా ఉంది. ఇక ఆయన పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ప్రజలతో పాటు అందరూ హర్షించారు. బడా బాబుల వద్ద నల్లదనం బయటకి వస్తుందని భావించారు. కానీ ఇది చివరకు ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. ఎంత నల్లడబ్బు బయటికి వచ్చిందో కూడా ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఇక ప్రత్యర్ధులను టార్గెట్ చేయడానికే ఈ పథకం పరిమితమైంది. విదేశాలలో ఉన్న నల్లడబ్బు తెస్తామన్నారు. అదీ లేదు. దాని గురించి మాట్లాడటమే మానేశారు.
తన సహచర మంత్రులు, గాలి జనార్ధన్‌రెడ్డి వంటివారికి నోట్ల రద్దులో 2వేల కోసం నానా అగచాట్లు పడిన ప్రజలు ఆర్భాటంగా పెళ్లిళ్లు, విందులు, వినోదాలు ఎలా చేశారో అర్ధం కాని విషయం. ఇక మోదీ నిర్ణయాన్ని స్వాగతించిన పలువురు పెద్ద నోట్ల రద్దు అని చెప్పి ఏకంగా 2వేల నోటును తేవడాన్ని తప్పుపట్టారు. ఇక అప్పుడు 100, 500, 2000 రూపాయల నోట్లు ఉండగా, 500లకి 1000లకి బాగా అంతరం ఉండటంతో ఇప్పటికే 200 నోట్‌ను విడుదల చేసిన ఆర్బీఐ త్వరలో 1000 రూపాయల నోట్లను కూడా ప్రజల్లోకి తేవడానికి సంసిద్దం అవుతుంది. ఇంత ఘనకార్యం చేసి మరలా పెద్దనోట్లను ప్రవేశపెట్టడం చూస్తుంటే కొండను తవ్వి ఎలుకని పట్టిన చందంగా ఉంది.
అత్త పగలకొడితే ఓటి కుండ.. కోడలు పగల కొడితే కొత్త కుండలా ఉంది వ్యవహారం. అయినా ఇదే సయమంలో మోదీ 1000నోట్లను ప్రవేశపెట్టి 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తే మాత్రం ఇప్పటికే తమ నల్లధనాన్ని 2వేల నోట్లలో దాచుకున్న వారు తమ అవినీతి ధనం, నల్లధనం విషయంలో ఇబ్బంది పడి, నిజమైన నల్లకుభేరులు బయటకి వస్తారని కొందరు ఆశగా ఎదురుచూస్తున్నారు.